అత్యాచారాలపై స్పెషల్ ఫోకస్!!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 05:56 PM

అత్యాచారాలపై స్పెషల్ ఫోకస్!!

వయసుతో సంబంధం లేకుండా ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు లెక్కలేనన్ని. కేసు నమోదు చేసుకున్న ఘటనలు కొన్ని అయితే అసలు పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కనవి మరెన్నో. అంతెందుకు.... మిస్సింగ్ కేసులలో దాదాపు చోటు చేసుకున్న ఘటనలన్ని కూడా హత్య, హత్యాచారానికి సంబంధించినవే.

హైదరాబాద్ లో ఇటీవల చోటు చేసుకున్న దిశ హత్య, అత్యాచారం సంఘటన యావత్ దేశాన్ని కలచి వేసిందనే చెప్పొచ్చు. ఈ ఘటనపై నిందుతులను వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిమిత్తం ఘటన స్థలానికి తీసుకెళ్లిన నేపథ్యంలో అనుకోనీ సందర్భంలో వారిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని మీడియాకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

నిందితుల మరణం ఉహించనిదే అయినప్పటికీ, వారి చావుపట్ల హర్శాతిరేకాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కాగా మరికొంత మంది దీనిపై ఆగ్రహంతో ఉండడం గమనార్హం. జాతీయ మానవ హక్కుల సంఘం సైతం ఈ కేసుని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.

ఎన్కౌంటర్ చేయడానికి గల కారణం ఏదైనప్పటికీ.... నిందితుల మరణంపై అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మరో పక్క నిందితుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. వారి వాదనలో న్యాయం ఉన్నప్పటికీ.... నిజానిజాలు పరిగణలోకి తీసుకున్నట్లయితే.... "తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు" అనేది అర్థమవుతుంది.

అయితే, నిందుతుల చావుతో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందా? లేక క్షణికావేశం(మద్యం మత్తు)లో చేసిన తప్పుకి నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయి అనుకోవాలా? అసలు సభ్య సమాజానికి ఇది ఎటువంటి తీరుని ఏర్పరుస్తుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. భావి భారత పౌరులకు మనం ఇచ్చే సందేశం ఏంటి? ఏది ఏమైనప్పటికీ..... నిందుతుల మరణం అనేక ప్రశ్నలకు తావిస్తున్న నేపథ్యంలో చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుందని తెలుస్తుంది.

సామాన్యంగా..... అత్యాచారాలు జరగడానికి గల కారణం ఏదైనా అవ్వొచ్చు. కానీ ఇందుకు నిందుతులు చెపుతున్న కారణాలు మాత్రం నిజంగా షాకింగ్ అనిపించక మానదు. అమ్మాయి ఒంటరిగా కనిపించిందనో, ప్రేమను అంగీకరించలేదనో, మద్యం మత్తులో ఉన్నామనో... ఇలా వివిధ రకాల సాకులు చెబుతూ.... శిక్ష నుండి తప్పించుకుంటున్నారు. కారణం ఏదైనా... బలి అయ్యేది బాధితురాలే!! కన్నవారికి మిగిలేది కడుపుకోతే అన్నట్లుగా తయారు అయ్యింది మన సమాజం.

ఆంగ్లేయులతో పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్న భారతీయులు.... మాతృభూమిపై మాతృమూర్తికి మాత్రం రక్షణ కలిపించలేకపోతున్నారని దాయాది దేశాలు మన గురించి హేళనగా ప్రచురిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఘటనలు మరోమారు జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి.

స్త్రీలను దేవతలతో సమానంగా పూజించే ఏకైక పుణ్యభూమిగా ప్రపంచానికి తెలిసిన భారత్..... ఇప్పుడు మన దేశానికి వచ్చే మహిళ పర్యాటకులను వారి రక్షణ పట్ల తగు జాగ్రత్తల కోసం ఒకటికి రెండు సార్లు ఆయా దేశాలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయంటే... ఇలాంటి ఘటనలు దేశం మొత్తానికి ఎంత నష్టం కలిగిస్తున్నాయో.... సాటి భారత పౌరులుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిపుణుల వాదన: ఇప్పటివరకు జరిగిన అత్యాచారాలలో... నిందితులు సగటుగా 16 - 25 ఏళ్ల లోపు కలిగిన వారే. దీనితో పాటు ప్రతి కేసులో మద్యం, మాదకద్రవ్యాల పాత్రే ఎక్కువగా కనిపిస్తుంది. తాగిన మత్తులో.... తల్లిని గానీ, చెల్లిని గానీ ఏమి అనని వ్యక్తి.... పరాయి ఆడపిల్ల విషయంలో మాత్రం మానవతా విలువలు మరిచి ప్రవర్తిస్తున్నడంటే.... ఇందుకు కారణం కచ్చితంగా తల్లిదండ్రులే. ఎదుగుతున్న వయసులో మంచి, చెడు చెప్పకపోవడం... ఎక్కువ గారాభం చేసి పరాయి ఆడవారు సైతం ఇంట్లో తల్లి... చెల్లితో సమానం అని నేర్పకపోవడం. కాగా, ఇవన్ని నేరాలకు పాల్పడటానికి ముఖ్య కారణాలు కాకపోవచ్చు, కానీ ఇవి కూడా ఒకందుకు నేరాలకు కారణం అవుతాయి.

స్వేచ్చ మానవ హక్కు. ఆడవారు ఎలా ఉండాలి? ఎప్పుడు బయటకు వెళ్లాలి? ఎందుకు వెళ్లాలి? ఎక్కడికి వెళ్లాలి? ఇవన్ని వారి వ్యక్తిగత సంబంధిత విషయాలు. దయచేసి చనిపోయిన వారి గురించి తప్పుగా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. ఆడవారికి జాగ్రత్తలు చెప్పే ముందు మగవాడి ఆలోచన దృక్పథం మార్చండి!! ఇదే ఈ సారాంశ ముఖ్య ఉద్దేశం!!





Untitled Document
Advertisements