పీఎస్‌ఎల్‌వీ సీ-48 కౌంట్‌డౌన్ స్టార్ట్

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 07:42 PM

పీఎస్‌ఎల్‌వీ సీ-48 కౌంట్‌డౌన్ స్టార్ట్

బుధవారం మధ్యాహ్నం 3.40 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-48 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహకనౌక ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 11 ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తోంది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ శివన్ మంగళవారం తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్వీసీ-48 వాహకనౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లడానికి పీఎస్‌ఎల్‌వీ సీ-48 రాకెట్‌ సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా 23 గంటల పాటు కొనసాగనుంది.ఇస్రో చరిత్రలో పీఎస్‌ఎల్వీ సీ-48 ప్రయోగం ప్రతిష్టాత్మకమైంది. పీఎస్‌ఎల్వీ వాహక నౌకకు ఇది 50వ ప్రయోగం కాగా.. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కావడం విశేషం. ఈ వాహకనౌక ద్వారా ఆర్‌ఏశాట్‌2, బీఆర్‌ 1 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.






Untitled Document
Advertisements