భారత్ గడ్డపై టీ20ల్లో ఒకే ఒక్కడు!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 07:57 PM

భారత్ గడ్డపై టీ20ల్లో ఒకే ఒక్కడు!

బుధవారం రాత్రి జరగనున్న మూడో టీ20లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నెం.1 రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ వాంఖడే టీ20లో 6 పరుగులు చేస్తే..? స్వదేశంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. భారత్ గడ్డపై ఇప్పటి వరకూ 28 మ్యాచ్‌లాడిన కోహ్లీ 994 పరుగులు చేశాడు. భారత టీ20 జట్టులోకి 2010లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 74 మ్యాచ్‌లాడి.. 51.26 సగటుతో 2,563 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కోహ్లీనే టాప్ స్కోరర్‌‌కాగా.. అతని తర్వాత స్థానంలో రోహిత్ శర్మ 2,562 పరుగులతో ఉన్నాడు. దీంతో.. ఈ ఇద్దరి మధ్య నెం.1 స్థానం కోసం వాంఖడే టీ20లో పోటీ జరగనుంది. స్వదేశంలో ఇప్పటి వరకూ టీ20ల్లో 1,000 పరుగులు నమోదు చేసిన క్రికెటర్లుగా న్యూజిలాండ్ హిట్టర్లు మార్టిన్ గప్తిల్ (1,430), కొలిన్ మున్రో (1,000) మాత్రమే రికార్డులో ఉన్నారు. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20పై ఉత్కంఠ నెలకొంది. ఉప్పల్ టీ20లో 94 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. తిరువనంతపురం టీ20లో 19 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. దీంతో.. వాంఖడే టీ20లోనైనా 1,000 పరుగుల రికార్డ్‌ని కోహ్లీ అందుకుంటాడేమో..? చూడాలి.






Untitled Document
Advertisements