లౌకిక దేశంలో మత ప్రాతిపదికన విభజనా?

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:59 AM

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పౌరసత్వ (సవరణ) బిల్లుపై అమెరికా స్టేట్ కమిషన్ ఆఫ్ ఇంటర్‌నేషన్ రిలీజియన్ ఫ్రీడమ్ (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్) తీవ్రంగా స్పందించింది. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని ఆక్షేపించింది. తప్పుడు దిశగా వెళ్తున్న ప్రమాదకరమైన మలుపుగా అభివర్ణించింది. ఈ బిల్లు కనుక పార్లమెంట్ ఆమోదం పొందింతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కీలక నేతలపై ఆంక్షలను పరిశీలించాలని తమ దేశ ప్రభుత్వానికి యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ సూచించింది. లౌకికదేశమనే చరిత్ర ఉన్న భారతదేశంలో మత ప్రతిపాదికన విభజన జరుగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.పౌరసత్వ సవరణ బిల్లుపై పాక్ కూడా స్పందించింది. పౌరసత్వ సవరణ బిల్లుకు భారత లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లు ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లుతో పాకిస్తాన్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భార త్ తూట్లు పొడిచిందని విమర్శించారు. అదే విధంగా బిజెపి మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను సైతం ఇమ్రాన్ తప్పుబట్టారు. హిందూ రాష్ట్ర భావనను విస్తరించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందంటూ ఆర్‌ఎస్‌ఎస్ వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది.అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని భారత విదేశాంగ శాఖ మంగళవారంనాడు సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుందని తెలిపింది. మతపరమైన మైనారిటీ శరణార్ధుల కష్టాలను తొలగించడం, వారి కనీస మానవ హక్కులను గౌరవించేడమే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేసింది. పౌరసత్వ బిల్లు, ఎన్‌ఆర్‌సిల ద్వారా ఏ ఒక్కరి పౌరసత్వానికి విఘాతం కలగదని తెలిపింది. పౌరసత్వ విధానాలను క్రమబద్ధీకరించే హక్కు అమెరికా సహా ప్రతి దేశానికీ ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది.





Untitled Document
Advertisements