పార్ట్ బి భూముల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 06:01 AM

రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పద భూముల సమస్యలను పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యెక దృష్టి సారించింది. దీనికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయడానికి సిసిఎల్‌ఏ కసరత్తు చేస్తోంది. తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన తర్వాత రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి కెటిఆర్ భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్ట్ బి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు, ధరణి వెబ్‌సైట్‌లో తహసిల్దార్లకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని రెవెన్యూ ఉద్యోగులు మంత్రి కెటిఆర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో సంబంధిత అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది. ఇదే విషయాన్ని మంత్రి కెటిఆర్ సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. భూ సమస్యల పరిష్కారానికి సాంకేతికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా పార్ట్ బి భూములకు సంబంధించిన ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ప్రభుత్వం రెవెన్యూ అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని వారికి మార్గదర్శకాలు జారీ చేసినట్టుగా తెలిసింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం నిర్వహించిన రికార్డుల ప్రక్షాళన సందర్భంగా 90 శాతం పైగా రికార్డులను రెవెన్యూ అధికారులు సరిచేశారు. చాలావరకు రికార్డులు పక్కాగా రూపుదిద్దుకున్నాయి. రైతులకు అన్ని రకాల భద్రతతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ప్రభుత్వం జారీచేసింది. వీటి ఆధారంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రభుత్వం అమలుచేస్తోంది. పలు వివాదాల నేపథ్యంలో కొద్దిశాతం భూములను రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పార్ట్ బిలో చేర్చారు. ఈ భూములపై ఉన్న వివాదాలను పరిష్కరించడానికి తహసీల్దార్లకు సరైన మార్గదర్శకాలు రాకపోవడంతో సమస్యలు పెం డింగ్‌లోనే ఉండిపోయాయి. పార్ట్ బిలో భూములున్న రైతులకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు వర్తించడంలేదు. పార్ట్ బిలో భూములున్న రైతులు మూడు పంటలకు సంబంధించిన రైతుబంధును కోల్పోయారు. ముఖ్యంగా పార్ట్ బిలో ఉన్న అసైన్డ్ భూములు, అటవీ, రెవెన్యూ సరిహద్దు తగాదాలు, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, ఎవేక్యూ, భాగస్వాముల తగాదాలు, సాదా బైనామా, కోర్టు తగాదాలతో హక్కుదారు ఎవరన్నది స్పష్టంగా తేలని భూములకు ఒక పరిష్కారం చూపాల్సి ఉందని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పొందుపరిచినట్టుగా సమాచారం. దీనికితోడు రైతుల మధ్య సరిహద్దు తగాదాలు, వైవాటీ భూముల సమస్య కూడా అపరిష్కృతంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా జరిగిన చిన్న చిన్న పొరపాట్లను ధరణి వెబ్ సైట్ ద్వారా సరిచేసే అవకాశం లేకపోవడంతో అధికారులు వాటిని సరిదిద్దలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్లపై రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కొన్నిచోట్ల అధికారులపై రైతులు దాడులకు కూడా దిగుతుండటంతో వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పార్ట్ బి భూముల సమస్యలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు వివాదాస్పద భూముల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో మొదటగా పార్ట్ బిలో ఉన్న భూములకు సంబంధించి ఒక్కో కేసును అధ్యయనం చేసి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.









Untitled Document
Advertisements