నిర్భయ గ్యాంగ్‌రేప్‌ నిందుతుడి పిటిషన్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే!!

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 10:05 AM

నిర్భయ గ్యాంగ్‌రేప్‌ నిందుతుడి పిటిషన్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే!!

నిర్భయ గ్యాంగ్‌రేప్‌- హత్య కేసులో ఉరిశిక్ష పడ్డ దోషుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ - క్షమాభిక్ష కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారంనాడు ఓ రివ్యూ పిటిషన్‌ వేశాడు. అందులో ఆయన కొన్ని వింతవాదనలు చేశారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్లోని సంగతుల్ని ప్రస్తావించాడు. ‘‘ఢిల్లీ, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) ప్రాంతాల్లో ఏం జరుగుతోందో మీకు తెలుసు.

వాయు కాలుష్యం మితిమీరిపోయింది. ఇది ఓ గ్యాస్‌ చాంబర్లా మారింది. నీరు విషపూరితమైంది. ప్రజలు చనిపోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు సమర్పించిన నివేదిక తెలియజేస్తోంది. కాలుష్యమే ప్రజల్ని చంపేస్తున్నపుడు ఇక మీరెందుకు మరణశిక్ష విధించడం..?’’ అని ప్రశ్నించాడు. ‘సత్యయుగంలో ప్రజలు వేల ఏళ్లు జీవించేవారట. ద్వాపర యుగంలో వందల ఏళ్లు బతికారట. కలియుగానికొచ్చేసరికి 50-60 ఏళ్లు బతికుండడమే కష్టమవుతోంది. వందేళ్లు పూర్తి చేసిన వారిని అరుదుగా చూస్తుంటాం.

80-90 ఏళ్లంటే చాలా గొప్ప. జీవితం తగ్గిపోతున్నపుడు ఆ తగ్గిన జీవితంలో ఇంకా ఈ శిక్షలెందుకు? మన చుట్టూ ఉన్న వారిని చూస్తున్నపుడు, కఠోర జీవన వాస్తవాలను ఎదుర్కొన్నపుడు, ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినపుడు మన బతుకూ శవంలానే ఉంది, జీవచ్ఛవాలం అని అనిపిస్తుంది..’’ అని పేర్కొన్నాడు ‘‘మరణశిక్ష అనేది ప్రస్తుత కాలంలో అనవసరం. ఉరి శిక్ష విధిస్తే నేరగాడు చనిపోతాడేమో గానీ నేరం చావదు. ఈ ఉరి కూడా గౌరవంగా బతికే పేదవారికే పడుతుంది. కుటుంబానికి ఆ పేద ప్రాణమే దిక్కు. సంపన్నులకు మరణశిక్ష పడదు. నేరం చేస్తే కచ్చితంగా శిక్ష పడుతుందని తెలియజేయడమే పెద్ద నేర-నిరోధకం. ఎంత తీవ్రమైన శిక్ష విధించారన్నది కాదు’’ అని అక్షయ్‌ సింగ్‌ తన లాయర్‌ ఏపీ సింగ్‌ ద్వారా సమర్పించిన వాదనల్లో అభిప్రాయపడ్డాడు.

మహిళలను హింసించిన వారిని ఉరితీస్తాం అని నిరూపించుకోవడానికి ప్రయత్నించే బదులు ప్రభు త్వం వ్యవస్థాగత లోపాలు సవరించుకోవాలని ఓ హితవు కూడా చెప్పాడు. నిర్భయ దోషులు నలుగురినీ- అక్షయ్‌, ముఖేశ్‌, వినయ్‌, పవన్‌గుప్తాలను ఈనెల 16న ఉరితీయవచ్చని ప్రచారం జరుగుతోంది. మిగిలిన ముగ్గురూ ఇప్పటికే రివ్యూ పిటిషన్లు వేసినా కోర్టు కొట్టేసి మరణశిక్ష విధించింది. ఉరి సమీపిస్తున్న సమయంలో అక్షయ్‌ ఈ పిటిషన్‌ వేయడం ఆఖరి ప్రయత్నంగా చెబుతున్నారు.





Untitled Document
Advertisements