హాలిడే ప్యాకేజీలను నమ్మేముందు కాస్త జాగ్రత్త

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 11:37 AM

హాలిడే ప్యాకేజీలను నమ్మేముందు కాస్త జాగ్రత్త

హాలిడే ప్యాకేజీల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. గ్లోబల్‌ తాజ్‌ ప్రైడ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎలిటన్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ పేరిట కంపెనీలు స్థాపించిన సలావుద్దీన్‌, షఫీ అహ్మద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లుగా పనిచేస్తూ మోసానికి తెరలేపారు. వీరితోపాటు మరికొంతమంది కలిసి పలు స్కీమ్‌ల పేరిట అమాయకులను దోచుకున్నారు. భారీగా డబ్బులు వసూలు చేసి హాలిడే ప్యాకేజీలు, ప్లాట్ల కేటాయింపు ఇస్తామని బాధితులను మభ్యపెట్టారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వెంచర్లు, హాలిడే ప్యాకేజీల గురించి వివరిస్తూ కస్టమర్లను ఆకర్షించారు.

అడ్వాన్స్‌లు, ఈఎంఐల పేరిట సుమారు 400 మంది సభ్యుల నుంచి రూ. 5 కోట్లు సేకరించారు. తర్వాత నిందితులు కంపెనీని మూసేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు నిందితుల్లో ఒకరైన షఫీ అహ్మద్‌ను ఈ నెల 6న అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు సలాఉద్దీన్‌ను ఈ నెల 9న అదుపులోకి తీసుకొని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. మోసం చేసి కాజేసిన డబ్బుతో నిందితులు మూడు విలాసవంతమైన డూప్లెక్స్‌ ఇళ్లు, కాచారం గ్రామంలో మూడు ప్లాట్లు, ఇతర ఆస్తులు కూడబెట్టినట్లు విచారణలో గుర్తించారు. ప్రధాన నిందితుడు సలాఉద్దీన్‌పై ఇతర కేసులు కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు.





Untitled Document
Advertisements