గుడ్ న్యూస్....ఏకంగా రూ.800 తగ్గిన బంగారం ధర

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 06:12 PM

గుడ్ న్యూస్....ఏకంగా రూ.800 తగ్గిన బంగారం ధర

ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర మార్నింగ్ సెషన్‌లో 0.05 క్షీణతతో 10 గ్రాములకు రూ.37,551కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం. బంగారం ధర గత ఆరు రోజుల్లో ఏకంగా రూ.800 పడిపోయింది. పసిడి ధర సెప్టెంబర్ నెల ఆరంభంలో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 స్థాయికి వెళ్లిపోయింది. అంటే మూడు నెలల కాలంలోనే బంగారం ధర ఏకంగా రూ.2,450 పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడుస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ధర కూడా 0.09 శాతం పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.43,469 స్థాయికి తగ్గింది. వెండి ధర మూడు నెలల కిందట కేజీకి ఏకంగా రూ.50 వేల మార్క్‌కు వెళ్లింది. గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం బంగారం లాభాల్లోనే కదలాడుతోంది. బంగారం ధర ఔన్స్‌కు 0.21 శాతం పెరుగుదలతో 1471.20 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. వెండి ధర కూడా 0.15 శాతం పెరుగుదలతో 16.72 డాలర్ల వద్ద ఉంది. బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గత వారంలో నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1484 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు పాలసీ సమావేశం ఇప్పటికే ప్రారంభమైంది. ఫెడరల్ రిజర్వు ఈ సారి వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటోదనని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చనే అంచనాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుతూ ఉన్నప్పటికీ భారత్‌లో మాత్రం ధర దిగువునే కదలాడుతోంది. దీనికి ప్రధాన కారణం అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలపడటం. దీంతో దేశీ మార్కెట్‌లో పసిడి వెలవెలబోతోంది. రూపాయి గత రెండు వారాల్లో 1.3 శాతం మేర బలపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను వణికిస్తూనే ఉన్నారు. మరోదఫా టారిఫ్‌ల విధింపునకు గడువు దగ్గరకు వచ్చేసింది. డిసెంబర్ 16 నుంచి చైనా దిగుమతులపై కొత్ టారిఫ్‌లు అమలులోకి రావాల్సి ఉంది. అయితే ఈ అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇరు దేశాలు టారిఫ్‌ల గడువు పొడిగింపు దిశగా చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, ఆర్థిక అస్థిర పరిస్థితులు బంగారం డిమాండ్ పెరిగేందుకు దోహదపడతాయి. బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావిస్తారు. అందుకే వడ్డీ రేట్లు తగ్గినా, వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగినా, ఆర్థిక అస్థిర పరిస్థితులు తలెత్తినా బంగారం ర్యాలీ చేస్తుంది. మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19 శాతం పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.




















Untitled Document
Advertisements