గోద్రా అల్లర్ల కేసు....మోదీకి క్లీన్ చిట్

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:13 PM

గోద్రా అల్లర్ల కేసు....మోదీకి క్లీన్ చిట్

2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి నానావతి కమిషన్ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. మోదీ 2014 ఎన్నికల వరకు గుజరాత్‌ సీఎంగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆయన హయాంలో జరిగిన గోద్రా అల్లర్ల ఘటన తర్వాత.. చెలరేగిన హింసాత్మక ఘటనల్లో వెయ్యి మందికిపైగా చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మైనార్టీలే. ఇందులో మోదీ ప్రమేయం ఉందడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అల్లరి మూకలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణమని నానావతి కమిషన్ తెలిపింది. నానావతి కమిషన్ రిపోర్టును ఐదేళ్ల క్రితం గుజరాత్ ప్రభుత్వానికి సమర్పించగా.. హోంశాఖ మంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా బుధవారం దాన్ని రాష్ట్ర అసెంబ్లీ ముందు ఉంచారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీల దహనం పక్కా ప్రణాళికతో చేసిందేనని.. తర్వాత జరిగిన అల్లర్లు మాత్రం ప్రణాళికా బద్ధంగా జరిగినవి కావని నానావతి కమిషన్ తెలిపింది.

*1500 పేజీల నివేదిక:

ఈ అల్లర్ల వెనుక రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మంత్రి ప్రమేయం ఉందనడానికి లేదా.. వారి ప్రోద్బలంతోనే దాడులు జరిగాయనడానికి ఆధారాలు లేవని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. 1500 పేజీలతో తొమ్మిది సంచికలుగా ఈ నివేదికను రూపొందించింది.

*పోలీసులదే తప్పు.. ఆయుధాలు లేవు..:

సరైన ఆయుధాలు లేకపోవడంతో.. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించలేకపోయారని.. అల్లరి మూకలను నియంత్రించలేకపోయారని నానావతి కమిషన్ తెలిపింది. అహ్మదాబాద్‌లో జరిగిన మత ఘర్షణల్లో పోలీసులు సామర్థ్యం మేరా వ్యవహరించలేదని.. తగిన చర్యలు తీసుకోలేదని కమిషన్ వెల్లడించింది. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

*మోదీకి క్లీన్ చిట్.. ఆ ముగ్గురు ఐపీఎస్‌లపై చర్యలకు సిఫారసు:

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై విచారణకు ఆదేశించాలని లేదా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఐపీఎస్ అధికారులు సంజయ్ భట్, రాహుల్ శర్మ, ఆర్బీ శ్రీకుమార్‌ల క్రెడిబులిటీని కమిషన్ ప్రశ్నించింది. మోదీతోపాటు దివంగత మంత్రి హరేణ్ పాండ్య, అశోక్ భట్ తదితర రాజకీయ నాయకులకు కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.

*2002 ఫిబ్రవరిలో ఘటన..:

2002 ఫిబ్రవరిలో గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలకు అల్లరి మూకలు నిప్పు అంటించగా.. 59 మంది కరసేవకులు సజీవ దహనం అయ్యారు. అనంతరం చెలరేగిన అల్లర్లలో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

విచారణ ఇలా..

ఈ అల్లర్ల కేసు విచారణకు గుజరాత్ హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి కె.జి.షాతో 2002 మార్చి 6న నాటి సీఎం మోదీ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ ఆయనతో మోదీకి ఉన్న సాన్నిహిత్యం కారణంగా మానవ హక్కుల సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో సుప్రీం రిటైర్డ్ జస్టిస్ జీటీ నానావతి పేరును కూడా కమిషన్‌లో చేర్చారు. మధ్యంతర నివేదిక సమర్పించడానికి ముందే షా చనిపోవడంతో.. గుజరాత్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ అక్షయ్ మెహతాను ఈ కమిషన్‌లో సభ్యుడిగా చేర్చారు. 2008 సెప్టెంబర్లో నివేదిక తొలి భాగాన్ని ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్.. 2014 నవంబర్ 18నన నాటి గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్‌కు మరో నివేదికను సమర్పించింది.





Untitled Document
Advertisements