విధ్వంసం సృష్టించిన టీంఇండియా... విండీస్ టార్గెట్...241

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 09:19 PM

విధ్వంసం సృష్టించిన టీంఇండియా... విండీస్ టార్గెట్...241

వెస్టిండీస్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లు చెలరేగారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (91: 56 బంతుల్లో 9x4, 4x6), రోహిత్ శర్మ (71: 34 బంతుల్లో 6x4, 5x6) మెరుపులకి కెప్టెన్ విరాట్ కోహ్లీ (70 నాటౌట్: 29 బంతుల్లో 4x4, 7x6) విధ్వంసం తోడవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో కాట్రెల్, విలియమ్స్, పొలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సిరీస్‌లో ఇప్పటికే ముగిసిన రెండు టీ20ల్లోనూ ఛేదనకు దిగిన జట్టే గెలుపొందిన నేపథ్యంలో.. భారీ స్కోరు చేయాలని నిర్ణయించుకున్న టీమిండియా తొలి ఓవర్‌ నుంచే బాదుడు మొదలెట్టింది. కేఎల్ రాహుల్ కాస్త ఆచితూచి ఆడినా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. దీంతో.. పవర్‌ ప్లే ముగిసే సమయానికి 72/0తో నిలిచిన భారత్ జట్టు.. 10 ఓవర్లకి 116/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. టాప్‌గేర్‌లో విండీస్ బౌలర్లని ఉతికారేసిన రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ తర్వాత జట్టు స్కోరు 135 వద్ద ఔటవగా.. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన రిషబ్ పంత్ డకౌటయ్యాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరంభం నుంచే హిట్టింగ్ మొదలెట్టేశాడు. కీరన్ పొలార్డ్ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సర్లు బాదేసిన కోహ్లీ 27 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌ నుంచి రాహుల్ కూడా బాదుడు మొదలెట్టడంతో భారత్ స్కోరు బోర్డు పరుగులెత్తింది. కానీ.. సెంచరీ ముంగిట భారీ షాట్ ఆడబోయి రాహుల్ ఔటవగా.. ఆఖరి బంతిని సిక్స్‌గా మలిచిన కోహ్లీ 240/3తో భారత్ ఇన్నింగ్స్‌ని ముగించాడు.






Untitled Document
Advertisements