పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 09:56 PM

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుకు వాడి వేడి వాదనలు చర్చల తరువాత రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి. సోమవారం రాత్రి లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును అమిత్ షా బుధవారం రాజ్య సభలో ప్రవేశపెట్టారు. టీడీపీ, వైఎస్సార్సీపీ ఈ బిల్లుకు మద్దతు తెలపగా.. టీఆర్ఎస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్, డీఎంకే తదితర విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్ సభలోఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన శివసేన.. రాజ్యసభలో ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఆ పార్టీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్, వామపక్షాల ప్రతిపాదన ఓటింగ్‌లో వీగిపోయింది. విపక్షాలు ఈ బిల్లుకు 14 సవరణలు ప్రతిపాదించగా.. అవన్నీ వీగిపోయాయి. బిల్లుపై ఓటింగ్ నిర్వహించడానికి ముందు వివిధ పార్టీలకు చెందిన 44 మంది ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు హోం మంత్రి అమిత్ షా సమాధానాలు ఇచ్చారు. ఈ బిల్లుపై 8 గంటలపాటు వాదోపవాదనలు కొనసాగాయి. లోక్ సభలో ఈ బిల్లు 334-106 ఓట్ల తేడాతో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో 245 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభలో పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఓటింగ్‌కు ముందు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. ఈ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్ కూడా గత ఐదేళ్లలో తొలిసారి విప్ జారీ చేసింది. ప్రభుత్వం శ్రీలంక తమిళులను విస్మరించిందిన డీఎంకే ఆరోపించింది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. సుప్రీంలో సవాల్ చేస్తామని కాంగ్రెస్ నేత చిందబరం ప్రకటించారు. పాకిస్థాన్‌లో మైనార్టీల సంఖ్య 1952 నుంచి వేగంగా తగ్గిపోతోందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. ఈ బిల్లును 50 ఏళ్ల క్రితమే తీసుకొస్తే.. పరిస్థితి ఇప్పటిలా ఉండేది కాదని అమిత్ షా తెలిపారు. పాలించడమే కాదు.. దేశ సమస్యలను పరిష్కరించడం కూడా మోదీ ప్రభుత్వ బాధ్యత అని షా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు తరహాలోనే.. ఈ బిల్లు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదని, దీని వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదని హోం మంత్రి స్పష్టం చేశారు.








Untitled Document
Advertisements