మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన ట్వీటర్

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 12:01 PM

మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన ట్వీటర్

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్వీటర్ మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఫేస్ బుక్ లో కూడా లేకపోవడం విశేషం. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీటర్ 2019లో ఎన్నో మార్పులకు లోనైంది. కానీ ఈ మధ్య అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఫీచర్ వీటన్నిటి కంటే పెద్దదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ ఫేస్ బుక్ లో లేనందుకు వినియోగదారులు ఎంతగానో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అదే ఇమేజ్ క్వాలిటీ కంప్రెషన్ ఫీచర్. ఫేస్ బుక్ లో మీరు ఏదైనా ఫొటో అప్ లోడ్ చేస్తే దాని క్వాలిటీ దారుణంగా పడిపోతుంది. చూడటానికి కూడా అంత అందంగా కనిపించదు. ఇంతకు ముందు ట్వీటర్ కూడా ఆ తరహాలోనే ఉండేది. కానీ ఇప్పుడు ట్వీటర్ లో ఫుల్ రిజల్యూషన్ తో ఫొటోలు అప్ లోడ్ చేయవచ్చు. అంటే.. మీ ఫోన్ లో ఫొటో ఏ క్వాలిటీలో అయితే ఉందో.. అంతే క్వాలిటీతో ట్వీటర్ లో ఫొటోను అప్ లోడ్ చేయవచ్చన్న మాట. ఎవరైనా ఆ ఫొటోను చూస్తే వారికి కూడా అదే క్వాలిటీతో కనిపిస్తుంది. ఈ విషయాన్ని ట్వీటర్ ప్రొడక్ట్ టీమ్ సభ్యుల్లో ఒకరు నేరుగా వెల్లడించారు. నేటి నుంచి ట్వీటర్ లో అప్ లోడ్ చేసే ఫొటోలు అప్ లోడ్ చేసే నాణ్యతలో 97 శాతం వరకు అదే నాణ్యతతో వస్తాయని పేర్కొన్నారు. అయితే ఫొటోలను థంబ్ నెయిల్ రూపంలో చూసినప్పుడు తక్కువ నాణ్యతలో కనిపిస్తూ.. వాటిని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అధిక నాణ్యతను కూడిన ఫొటోలు కనిపిస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా ట్వీటర్ త్వరలో పని చేసే అవకాశం ఉంది. గత నెలలోనే ట్వీటర్ రిప్లైలను కనిపించకుండా చేసే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే మీ ట్వీట్ కింద ఎవరైన ఇచ్చిన రిప్లై మీకు నచ్చకపోతే దాన్ని మీరు కనిపించకుండా చేయవచ్చన్న మాట. ఫేస్ బుక్ లో అయితే ఇలా పోస్టుల కింద నచ్చని కామెంట్లు పెట్టినట్లయితే వాటిని డిలీట్ చేసే అవకాశం ఉంది. ట్వీటర్ లో పూర్తిగా డిలీట్ చేసే అవకాశం లేకపోయినా.. ఇలా దాచిపెట్టే అవకాశాన్ని ట్వీటర్ అందిస్తోంది. వీటి సాయంతో మీరు చేసే ట్వీట్ల కింద జరిగే సంభాషణలను మీరు నియంత్రించవచ్చని ట్వీటర్ తెలుపుతోంది. 2019లో అయితే ట్వీటర్ ఎన్నో మార్పులకు లోనైంది. 2020లో కూడా వినియోగదారులను మెప్పించేలా మరిన్ని మార్పులను చేస్తారా? లేక ఇంతటితో ఆగిపోతారా? అనేది చూడాలి మరి!







Untitled Document
Advertisements