తెలంగాణలో రూ. 900 కోట్ల పెట్టుబడి

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 03:30 PM

తెలంగాణలో రూ. 900 కోట్ల పెట్టుబడి

దక్షిణ కొరియాకు చెందిన టెక్స్ టైల్ దిగ్గజ సంస్థ యాంగోన్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలో రూ. 900 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో 290 ఎకరాల్లో ఈ సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే, సుమారు 12 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.

ఈ కేంద్రం నుంచి ఔట్ డోర్ వేర్, ఎగుమతి నిమిత్తం దుస్తులు తయారు చేయాలని యాంగోన్ భావిస్తోందని, ఈ దిశగా ప్రభుత్వంతో ఒప్పందం కూడా జరిగిందని రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కొరియాలో భారత అంబాసడర్ శ్రీప్రియా రంగనాథన్, ఇండియాలో కొరియా అంబాసడర్ షిన్ బొంగ్ కిల్ సమక్షంలో ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం, యాంగోన్ కార్పొరేషన్ సంతకాలు చేశాయి.

వరంగల్ లో తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో అతిపెద్ద పెట్టుబడి సౌత్ కొరియా సంస్థదేనని తెలుస్తోంది. శివంపేట విలేజీని కాటన్ హబ్ గా మార్చాలని ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలను ఇప్పటికే టెక్స్ టైల్ సంస్థల కోసం ప్రభుత్వం సమీకరించి సిద్ధంగా ఉంచింది. దక్షిణ కొరియా నుంచి ప్రత్యక్ష పెట్టుబడులు రాష్ట్రానికి వస్తుండటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఈ మెగా పార్క్ లో నాలుగు గార్మెంట్ యూనిట్లు, ఒక టెక్నికల్ టెక్స్ టైల్ యూనిట్, మరో ప్రాసెసింగ్ యూనిట్, ఒక నిట్టింగ్ యూనిట్ ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ టెక్స్ జైల్ విభాగం డైరెక్టర్ మిహిర్ పారేఖ్ వెల్లడించారు. ఇప్పటికే బంగ్లాదేశ్, వియత్నాం, ఇథియోపియా సహా 13 దేశాల్లో విస్తరించిన యాంగోన్, తెలంగాణకు రావడం గర్వకారణమని అన్నారు. వరంగల్ పార్క్ లో ఇప్పటికే 370 ఎకరాలను వివిధ కంపెనీలకు ఇచ్చామని, అవన్నీ, దాదాపు రూ. 1,800 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నాయని తెలిపారు.





Untitled Document
Advertisements