రాష్ట్రంలో ‘మీ-సేవ’ కేంద్రాలు బంద్

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 04:49 PM

రాష్ట్రంలో  ‘మీ-సేవ’ కేంద్రాలు బంద్

రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ-సేవ’ కేంద్రాలు పని చేయవు. మూడు రోజుల పాటు ఈ అంతరాయం ఉండనుంది. ఈ విషయాన్ని నిజామాబాద్‌ జిల్లా ఈడీఎం కార్తీక్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘మీ-సేవా’ డేటా బేస్‌ కార్యకలాపాలను మెరుగుపరుస్తున్నందుకు ఈ అంతరాయం తలెత్తుతున్నట్లు ఆయన ప్రకటనలో వెల్లడించారు. డేటా బేస్ సేవలు మరింత అభివృద్ధి చేసేందుకు మూడు రోజుల సమయం పడుతుందని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీ సేవ కార్యాలయాలను మూసి ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని కార్యాలయాలకు ముందస్తు సమాచారం పంపినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మీ-సేవ నిర్వహకులు కూడా ముందుగానే ఈ అంతరాయం గురించి ప్రజలకు వివరించాలని వారు సూచించారు. కేవలం నిజామాబాద్ జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంతరాయం ఉంటుందని వివరించారు. ఈ నెల 13న రాత్రి ఏడు గంటల నుంచి డిసెంబర్‌ 16న ఉదయం వరకూ మీ సేవ కార్యాలయాలు మూసి ఉంటాయని తెలుస్తోంది. మళ్లీ డిసెంబర్‌ 16 ఉదయం 8 గంటల నుంచి మీ సేవ కేంద్రాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కార్తీక్ వివరించారు. ఈ విరామానికి ప్రజలు సహకరించాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ-సేవ కార్యాలయాలు ప్రజా సేవలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. చాలా రకాల ధ్రువీకరణ పత్రాలు మొదలు, బిల్లుల చెల్లింపు వంటి ఎన్నో సేవలు మీ-సేవ ద్వారా పొందవచ్చు. విద్యార్థులు, యువత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, కరెంటు బిల్లుల చెల్లింపులు, దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలకు మీ-సేవ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. నిత్యం లక్షలాది మంది ప్రజలు మీ సేవ ఎన్నో ప్రభుత్వ సేవలను నేరుగా పొందుతున్నారు. మూడు రోజుల పాటు మీ సేవ కార్యాలయాలు పని చేయకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా దీని కేంద్రంగా సేవలు పొందాలనుకొనే వారికి తిప్పలు తప్పేలా లేవు.


Untitled Document
Advertisements