మృతదేహాల వ్యవహారాన్ని సుప్రీంలోనే తేల్చుకోండి: హైకోర్టు

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 06:16 PM

మృతదేహాల వ్యవహారాన్ని సుప్రీంలోనే తేల్చుకోండి: హైకోర్టు

దిశ నిందితుల మృతదేహాల అప్పగింత విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. విచారణపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని వెల్లడించింది. ఎన్‌కౌంటర్‌పై విచారణకు సుప్రీంకోర్టు కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, అన్ని ఇతర విచారణలపై స్టే విధించిందని ఈ సందర్భంగా హైకోర్టు వెల్లడించింది.నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే విషయంపై స్పష్టత ఇవ్వాలని న్యాయవాదులు ప్రశ్నించగా.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అడ్వొకెట్ జనరల్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో రెండో రోజైన గురువారం విచారణ కొనసాగింది. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌పై ఉన్న ఇతర దర్యాప్తులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాల వరకు ఇతర విచారణలు జరపొద్దని ఆదేశించింది. దీంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)తో పాటు, హైకోర్టు, సిట్ జరుపుతున్న విచారణను తప్పనిసరిగా నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కర్‌ నేతృత్వంలో సర్వో్న్నత న్యాయస్థానం త్రిసభ్య విచారణ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్‌లో సరైన చోట ఉండి విచారణ చేయాలని ఈ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషన్‌ అవసరాలు, ఖర్చులను కూడా తెలంగాణ ప్రభుత్వమే తీర్చాలని ఆదేశించింది. తొలి విచారణ తేదీ విచారణ కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న వారి ఇష్టమేనని.. విచారణ చేపట్టిన నాటి నుంచి ఆరు నెలల్లో కోర్టుకు నివేదిక అందించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై లాయర్లు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్‌ యాదవ్‌, ముఖేశ్‌ కుమార్‌ శర్మ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బోబ్డే ధర్మాసనం రెండో రోజు విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గి వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు జరుగుతున్నందున త్రిసభ్య కమిటీ విచారణ అవసరం లేదని ఆయన వాదనలు వినిపించారు.సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణకు తాము వ్యతిరేకం కాదని.. అయితే ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే సిట్‌ దర్యాప్తు జరుగుతున్నందున దానికి సమాంతరంగా రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ అవసరం లేదని ముకుల్ రోహిత్గి వివరించారు. అయితే.. ఆయన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ‘మీరు తప్పు చేశారని మేం అనడం లేదు, కానీ దర్యాప్తులో లభిస్తున్న ప్రతి ఆధారం మీడియాకు వెంటనే ఎలా వెళ్తోంది?’ అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అందుకే పారదర్శక విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో మీడియా, సోషల్‌ మీడియాను కట్టడి చేయాలని ఆదేశించింది.
















Untitled Document
Advertisements