CAA 2019: తెరపైకి మన్మోహన్ వీడియో...కాంగ్రెస్‌కు చెక్!

     Written by : smtv Desk | Fri, Dec 20, 2019, 11:16 AM

CAA 2019: తెరపైకి మన్మోహన్ వీడియో...కాంగ్రెస్‌కు చెక్!

కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతుండగా గురువారం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ సహా విపక్షాలు మద్దతు ఇస్తుండటంతో వారిని ఇరుకునపెట్టడమే లక్ష్యంగా బీజేపీ కొత్త అస్త్రాలను తెరపైకి తీసుకొస్తుంది. గతంలో పౌరసత్వ చట్టంపై విపక్ష నేతలు చేసిన ప్రసంగాల వీడియోలను బయటపెడుతోంది. తాజాగా, 2003లో కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన వీడియోను బయటపెట్టింది. 2003లో విపక్షనేత హోదాలో రాజ్యసభలో మన్మోహన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌ లాంటి దేశాల నుంచి శరణార్థులు వస్తే ఔదార్యం ప్రదర్శించాలని నాటి ప్రభుత్వాన్ని కోరారు. ‘దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో మైనారిటీలు తీవ్రమైన హింసను ఎదుర్కొన్నారు.. ఆ దురదృష్టవంతులు భారత్‌కు శరణార్థులుగా రావాల్సిన పరిస్థితులు తలెత్తితే.. వారికి పౌరసత్వం మంజూరు చేయడంలో ఔదార్యం ప్రదర్శించడం మన నైతిక బాధ్యత. పౌరసత్వ చట్టానికి సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించేటప్పుడు ఈ అంశాన్ని ఉప ప్రధాని అద్వానీ మనసులో ఉంచుకుంటారని ఆశిస్తున్నా’ అని వీడియోలో మన్మోహన్‌ వ్యాఖ్యానించారు. నాడు అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురాగా, ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే నాటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ నజ్మా హెప్తుల్లా సైతం దీనిని అంగీకరిస్తూ.. పాకిస్థాన్‌లోనూ మైనార్టీలు హింసను ఎదుర్కొంటున్నారు.. వారి పట్ల కూడా దయచూపించాలని అద్వానీని కోరారు. ఈ వ్యాఖ్యలను నాటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్ మహాజన్ సమర్ధించారు. జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ సహా ప్రముఖ నేతలు సైతం పొరుగుదేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న మైనార్టీలు శరణార్ధులుగా దేశంలోకి వస్తే వారికి భారత పౌరసత్వం కల్పించాలని నాడు చేసిన ప్రకటనలను సైతం బీజేపీ వైరల్ చేస్తోంది. నాడు 2003లో ప్రతిపక్ష నేత హోదాలో కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ ఏదైతే సూచనలు చేశారే వాటినే సరిగ్గా అమలుచేస్తున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.







Untitled Document
Advertisements