ఏడాదిలోగానే ఆర్టీసీని లాభాలబాటలోకి తేవాలనే లక్ష్యంగా ప్రభుత్వం

     Written by : smtv Desk | Sat, Dec 21, 2019, 10:45 AM

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే రాములు నాయక్ శనివారం ఉదయం ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు సిఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆర్టీసీలో కార్గో సర్వీసులను ప్రారంభిస్తున్నాము. రాష్ట్రంలో కొన్ని డిపోలు నష్టాలలో నడుస్తున్నాయి. వాటికి కారణాలు తెలుసుకొని ఏవైనా సమస్యలున్నట్లయితే పరిష్కరించి వాటినే లాభాలబాటలోకి తెస్తాము. ఏడాదిలోగానే ఆర్టీసీని లాభాలబాటలోకి తేవాలనే లక్ష్యంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొంటోంది. ఆర్టీసీ కార్మికుల సహకారంతో సాధించగలమనే నమ్మకం మాకుంది. ఆర్టీసీ పరిస్థితులు తెలుసుకోవడానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నెలకోసారైనా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని కోరుతూ లేఖలు వ్రాశాము,” అని అన్నారు.

ఆర్టీసీని ఏడాదిలోగా లాభాలబాట పట్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుండటం చాలా అభినందనీయం. దానిని సాధ్యం చేసి చూపాలని ఆర్టీసీ కార్మికులు, ప్రజలు కూడా కోరుకొంటున్నారు. ఆర్టీసీని ఏడాదిలోగా లాభాలబాటలోకి తీసుకురాగలమని ప్రభుత్వం నమ్మకంగా చెపుతున్నప్పుడు ఇదేపని 4-5 ఏళ్ళ క్రితమే చేసి ఉండి ఉంటే ఇన్ని వేలకోట్లు నష్టాలు, అప్పులు, సమ్మెలు, కార్మికుల మరణాలు, ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కావు కదా?

Untitled Document
Advertisements