అయిదేళ్లలో 1483 యాసిడ్ దాడులు

     Written by : smtv Desk | Mon, Jan 13, 2020, 09:49 PM

దేశంలో అమ్మాయిలు, మహిళలపై యాసిడ్ దాడులు చేస్తున్న సంఘటనలు కొద్దిగా తగ్గాయి. కానీ చాలా కేసుల్లో నిందితులపై చార్జిషీట్లు కూడా ఫైల్ కావడం లేదు. చార్జిషీట్లు ఫైల్ అయినా విచారణ పూర్తి కావడం లేదు. విచారణ పూర్తయినా దోషులకు శిక్ష పడుతున్న సందర్భాలు మాత్రం గత రెండేళ్లుగా బాగా తగ్గిపోయాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2018 రిపోర్ట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 2014 నుంచి 2018 మధ్య ఐదేళ్లలో 1,483 మంది మహిళలపై యాసిడ్ దాడులు జరిగాయని రిపోర్ట్ లో తేలింది. 2017లో అత్యధికంగా 319 మందిపై యాసిడ్ అటాక్స్ జరిగాయని వెల్లడైంది. 2018లో మాత్రం ఈ కేసులు 228కి తగ్గాయని తేలింది.
*కనీసం చార్జిషీట్లూ ఫైల్ అయితలేవ్..
2017, 2018 సంవత్సరాల్లో అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే దోషులకు శిక్ష పడుతున్న సందర్భాలు బాగా తగ్గిపోయాయని నివేదిక పేర్కొంది. ఈ రెండు సంవత్సరాల్లో 596 యాసిడ్ అటాక్ కేసులు నమోదయ్యాయి. 623 మంది బాధితులుగా మారారు. కానీ ఏటా149 మందిపై మాత్రమే చార్జిషీట్లు ఫైల్ అయ్యాయి. అంటే ఏటా జరిగిన యాసిడ్ అటాక్స్ లో చార్జిషీట్ ఫైల్ అవుతున్న కేసులు సగం కూడా లేవు. 2014లో మాత్రం 244 యాసిడ్ అటాక్స్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 201 మందిపై చార్జిషీట్లు దాఖలయ్యాయి.
*శిక్షలు పడుతున్నదీ తక్కువే..
యాసిడ్ అటాక్స్ కేసుల్లో దోషులకు శిక్షలు పడుతున్నవి కూడా చాలా తక్కువే ఉంటున్నాయని ఎన్ సీఆర్ బీ నివేదికను బట్టి తెలుస్తోంది. 2015లో అత్యధికంగా 734 కేసుల్లో విచారణ జరిగింది. వీటిలో విచారణ పూర్తయిన కేసుల ప్రకారం కన్విక్షన్ రేటు చూస్తే 45.4 శాతంగా నమోదైంది. మహిళలపై ఇతర నేరాల్లో కన్విక్షన్ రేటు కంటే ఇది చాలా బెటర్ గా ఉంది. కానీ, 734 కేసులు విచారణకు రాగా, వాటిలో కేవలం 33 కేసుల్లో మాత్రమే ట్రయల్ పూర్తయింది. అంటే.. కేసుల విచారణ చాలా నిదానంగా సాగుతోంది. విచారణ పూర్తయిన కేసుల్లో ఎంత శాతం కేసుల్లో దోషులకు శిక్ష పడుతోందన్న దానిని బట్టి కన్విక్షన్ రేటును నిర్ణయిస్తారు. అయితే 2016, 2017లో 67 కేసుల్లో విచారణ పూర్తి కాగా, కేవలం 25 కేసుల్లోనే దోషులకు శిక్ష పడింది. ఈ రెండు సంవత్సరాల్లో 849 కేసులు విచారణకు వెళ్లాయి. ఇక 2018లో కన్విక్షన్ రేటు ఏకంగా 61 శాతంగా రికార్డ్ అయింది. కానీ ఈ ఏడాది 523 కేసులు విచారణకు రాగా, కేవలం19 కేసుల్లోనే దోషులకు శిక్ష పడింది.
*2018లో తెలంగాణ టాప్ 3
యాసిడ్ అటాక్స్కు సంబంధించిన కేసుల్లో 2014 నుంచి 2018 మధ్య యూపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు ఏటా టాప్ 10లో ఉన్నాయి. ఈ ఐదేండ్లలో ఈ మూడు రాష్ట్రాల్లోనే 42 శాతం మంది మహిళలు బాధితులుగా మారారు. ఇక 2018లో వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా 36 యాసిడ్ అటాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత యూపీలో 32 కేసులు ఫైల్ అయ్యాయి. తెలంగాణలో10 కేసులు నమోదై, టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. దేశవ్యాప్తంగా చూస్తే 2018లో యాసిడ్ అటాక్స్ కొంచెం తగ్గాయి. యూపీలో 2017లో 41 కేసులు నమోదు కాగా, 2018లో 32కు తగ్గాయి.
*నేరం రుజువైతే10 ఏళ్ల జైలు..
యాసిడ్ దాడి కేసుల్లో దోషులుగా తేలినవారికి ఐపీసీ సెక్షన్ 326ఏ ప్రకారం కనీసం పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. గరిష్టంగా ఫైన్ తో సహా జీవితఖైదును కూడా విధించేందుకు అవకాశం ఉంది.
*రోజూ109 మంది పిల్లలపై లైంగిక వేధింపులు
దేశంలో రోజూ109 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయట. 2017తో పోలిస్తే 2018లో ఈ నేరాలు ఏకంగా 22% పెరిగాయట. పోక్సో చట్టం కింద 2017లో 32,608 కేసులు నమోదు కాగా, 2018లో 39,827 కేసులు రిజిస్టర్ అయ్యాయని ఎన్ సీఆర్ బీ తాజా నివేదిక వెల్లడించింది. 2018లో చిన్నారులపై 21,605 రేప్ కేసులు ఫైల్ అయ్యాయి. వీటిలో అమ్మాయిలపై 21,401, అబ్బాయిలపై 204 రేప్ సంఘటనలు జరిగాయి. మహారాష్ట్రలో ఎక్కువగా 2,832 ఘటనలు జరిగాయి. ఆ తర్వాత యూపీలో 2,023, తమిళనాడులో 1,457 కేసులు ఫైల్ అయ్యాయి. పిల్లలపై జరిగిన అన్ని రకాల నేరాలకు సంబంధించి 2017లో 1,29,032 కేసులు నమోదు కాగా, అవి 2018లో 1,41,764 కు పెరిగాయి. ఇక తెలంగాణలో చిన్నారులపై అన్ని రకాల నేరాలు కలిపి 2018లో 3,747 కేసులు నమోదయ్యాయి. దేశంలోని అన్ని కేసుల్లో ఇది 2.6%. 2017లో 3,580 నేరాలు నమోదయ్యాయి.





Untitled Document
Advertisements