నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 10:44 AM

ప్రపంచ క్రికెట్‌లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా.. గత కొంతకాలంగా వరుస విజయాలతో జోరు మీదున్న భారత్, ఆసీస్‌ ల మధ్య.. మూడు వన్డేల సిరీస్‌ ఇవాళ ముంబై లో జరిగే మ్యాచ్‌ తో ప్రారంభం కానున్నది. రెండు జట్లు కూడా పూర్తి స్థాయి జట్లతో బరిలోకి దిగుతుండడంతో సిరీస్‌ మొత్తం హోరాహోరీగా సాగనున్నది. వెస్టిండీస్‌, శ్రీలంక జట్లపై ఏకపక్ష విజయాలను సాధించిన టీమ్‌ ఇండియా.. ఈ సిరీస్‌లో మాత్రం గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్‌ కప్‌ ముందు.. భారత్ తో జరిగిన వన్డే సిరీస్‌ ను ఆసీస్‌ 3-2 తేడాతో గెలుచుకోవడంతో.. కెప్టెన్‌ కోహ్లీ సేనకు ఇప్పుడు లెక్క సరి చేయాల్సిన సమయం వచ్చేసింది.

టీమ్‌ ఇండియా ఈ సిరీస్‌ కోసం పూర్తి స్థాయిలో జట్టుతో బరిలోకి దిగుతోంది. విశ్రాంతి తర్వాత రోహిత్‌ శర్మ, మహమ్మద్‌ షమీ తిరిగి జట్టులోకి వచ్చారు. బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ, ధావన్‌, రాహుల్‌, కోహ్లీతో టాప్‌ అర్డర్‌ బలంగా ఉన్నది. అటు బౌలింగ్‌లోనూ బుమ్రా, షమీతో పాటు రవీంద్ర జడేజా, కుల్‌ దీప్‌తో పాటు శ్రీలంకతో సిరీస్‌లో రాణించిన సైనీ, శార్దూల్‌ ఉన్నారు. జట్టులో ఏకైక వికెట్ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ ను తీసుకున్నా.. కేఎల్‌ రాహుల్‌ తో కీపింగ్‌ చేయిస్తే.. పంత్‌ కు తుది జట్టులో స్థానం లభించకపోవచ్చు.

అటు ఆసీస్‌ కూడా పటిష్ట జట్టుతో బరిలోకి దిగుతోంది. గత పర్యటనలో స్మిత్‌, వార్నర్‌ లు లేకున్నా.. ఆసీస్‌ వన్డే సిరీస్‌ను గెలిచింది. ఇప్పుడు స్మిత్‌, వార్నర్‌ తో పాటు కొత్త సంచలనం లబుషేన్‌ రూపంలో మరో అణిముత్యం ఆస్ట్రేలియాకు దొరికాడు. టెస్టుల్లో వరుస సెంచరీలతో దుమ్ము రేపుతున్న లబుషేన్‌.. వన్డేల్లోనూ రాణించి ఆసీస్‌ జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు. అటు స్మిత్‌, వార్నర్‌ తో పాటు కెప్టె న్‌ ఫించ్‌, కీపర్‌ అలెక్స్‌ క్యారీ ఉండడంతో.. టాప్‌ అర్డర్‌ నుంచి మిడిల్‌ అర్డర్‌ వరకు ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉన్నది. మరో వైపు పాట్ కమ్మిన్స్‌, మిచెల్ స్టార్క్‌ తో పాటు అగర్, ఆడమ్‌ జంపా ఆసీస్‌ బౌలింగ్‌ భారాన్ని మోయనున్నారు.

మొత్తం మీద రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో.. ఈ సిరీస్‌ అభిమానులకు ఫుల్‌ మజాను అందించండం ఖాయంగా కనిపిస్తోంది.





Untitled Document
Advertisements