బ్యాక్టీరియాతో కాంక్రీట్​ తయారీ...గోడలను రిపేర్‌‌ చేసే శక్తి!

     Written by : smtv Desk | Fri, Jan 17, 2020, 12:19 PM

బ్యాక్టీరియాతో కాంక్రీట్​ తయారీ...గోడలను రిపేర్‌‌ చేసే శక్తి!

ఇంటిని లేదా కట్టడాన్ని సజీవంగా ఉంచాలన్న ఉద్దేశంతో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ కొలరాడో బౌల్డర్​ సైంటిస్టుల ఈ సజీవ కాంక్రీట్​కు రూపమిచ్చారు. మరి, దానికి ‘లైఫ్​’ ఎలా ఇచ్చారు? అంటే వాళ్లకు కనిపించిన ఆప్షన్​ బ్యాక్టీరియా. అవును, ఇప్పటిదాకా బ్యాక్టీరియాతో తయారు చేసిన సిమెంట్​గానీ, కాంక్రీట్​గానీ లేదు. ఇదే తొలిసారి. ఇసుక, హైడ్రోజెల్​కు సయనోబ్యాక్టీరియాను కలిపారు. వాటిలో బ్యాక్టీరియా కాలనీలు ఏర్పడేలా చేశారు. తర్వాత బ్యాక్టీరియా ఇసుక, జెల్​ను కాంక్రీట్​లా మార్చేసింది. సయనోబ్యాక్టీరియా సూర్యుడి వెలుతురును తీసుకుంటూ గాల్లోని కార్బన్​ డయాక్సైడ్​ను పీల్చుకుని కాల్షియం కార్బొనేట్​ను తయారు చేసింది. సిమెంట్​లో అతి కీలకమైనది పదార్థం ఈ కాల్షియం కార్బొనేటే. అలా తయారైన కాల్షియం కార్బొనేట్​, ఇసుక, హైడ్రోజెల్​ మధ్య బంధాలను గట్టి పరిచింది. కాంక్రీట్​ను తయారు చేసింది. ఒకవేళ గోడలకు ఎప్పుడైనా నెర్రెలు వచ్చినా, తనంతట తానే రిపేర్​ చేసుకునే శక్తి దీనికి ఉంటుంది. కారణం, ఇప్పుడు చెప్పినట్టు కాల్షియం కార్బొనేట్​ను తయారు చేసుకోవడమే. హైడ్రోజెల్​లోని తేమ, పోషకాలను తీసుకుంటూ అవసరమైన కాల్షియం కార్బొనేట్​ను ఆ బ్యాక్టీరియా తయారు చేసుకుంటుంది. అందుకే దీన్ని ‘అలైవ్​ కాంక్రీట్​’ అని సైంటిస్టులు పిలుస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి క్లైమేట్​ చేంజ్​. దానికి ప్రధాన కారణం కార్బన్​ డయాక్సైడే. ప్రపంచంలో దాదాపు 6 శాతం కార్బన్​ డయాక్సైడ్​ వాయువులు సిమెంట్​ వల్లే పుడుతున్నాయన్నది సైంటిస్టుల వాదన. సిమెంట్​ తయారీ దగ్గర్నుంచి, కాంక్రీట్​గా మారేంత వరకు ఆ విష వాయువులు వెలువడుతున్నాయన్నది సైంటిస్టులు చెబుతున్న మాట. అయితే, ఈ అలైవ్​ బ్యాక్టీరియా కాంక్రీట్​ వల్ల ఆ సమస్య ఉండదని, తనంతట తానే గోడను రిపేర్​ చేసుకునే శక్తి దీని సొంతమని అంటున్నారు. ఓ ఇటుకను విరగ్గొట్టి దానికి బ్యాక్టీరియాను కలిపితే అది మళ్లీ కాంక్రీట్​ ఇటుకలా మారుతుందని చెబుతున్నారు. మూడు తరాల బ్యాక్టీరియా (బ్యాక్టీరియా కాలనీలకు సంబంధించి) ఒక్కో ఇటుకను 8 ఇటుకలుగా మారుస్తుందంటున్నారు. ఈ అలైవ్​ బ్యాక్టీరియా కాంక్రీట్​ వల్ల పెద్దగా నష్టాలేమీ లేనప్పటికీ, ఒకే ఒక్క సమస్య మాత్రం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియాతో కాంక్రీట్​ తయారు చేయాలంటే ఎప్పుడూ ఆ బ్యాక్టీరియాకు తేమ అవసరం అని చెబుతున్నారు. కాంక్రీట్​ బ్లాక్​ తయారయ్యాక అది ఎండిపోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే, దాని వల్ల ఆ కాంక్రీట్​ బ్లాక్​లోని బ్యాక్టీరియా బతికే చాన్సెస్​ తగ్గిపోతాయి. దాని మీద ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో కాంక్రీట్​పై ప్రభావం పడే అవకాశాలుంటాయి. ప్రస్తుతం ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, కొద్ది రోజుల్లో దానినీ అధిగమిస్తామని చెబుతున్నారు. తేమ ఎక్కువగా లేని ప్రాంతాల్లో ఈ కాంక్రీట్​తో ఉపయోగం ఉండదని, అన్ని చోట్లా వాడుకునేలా దానిని డెవలప్​ చేస్తామని అన్నారు.





Untitled Document
Advertisements