'SBI vs పోస్టాఫీస్‌'...రెండింటిలో ఏది బెస్ట్?

     Written by : smtv Desk | Fri, Jan 17, 2020, 06:17 PM

'SBI vs పోస్టాఫీస్‌'...రెండింటిలో ఏది బెస్ట్?

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) , పోస్టాఫీస్‌ లు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు చోట్ల డబ్బులను డిపాజిట్ చేయొచ్చు. అలాగే ఎస్‌బీఐ, పోస్టాఫీస్‌లు రెండూ రికరింగ్ డిపాజిట్ సేవలు అందిస్తున్నాయి. రికరింగ్ డిపాజిట్ల విషయానికి వస్తే ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. చిన్న మొత్తంలో కూడా పొదుపు చేసుకోవచ్చు. బ్యాంక్‌కు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి రికరింగ్ ఖాతా తెరవొచ్చు. అయితే వడ్డీ రేట్లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. స్టేట్ బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్లపై 6.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. అదే ఇండియా పోస్ట్ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌పై ఏకంగా 7.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అంటే ఎస్‌బీఐ బ్యాంక్‌లో కన్నా పోస్టాఫీస్‌లోనే వడ్డీ ఎక్కువగా వస్తోంది. అంటే మెచ్యూరిటీ సమయంలో పోస్టాఫీస్‌లోని డిపాజిట్లకే ఎక్కువ రాబడి లభిస్తుంది. పోస్టాఫీస్ డిపాజిట్లపై వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే త్రైమాసికం చొప్పున మారుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లను తగ్గించడం లేదా పెంచడం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా కొనసాగించొచ్చు. పోస్టాఫీస్‌కు వెళ్లి రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కనీసం నెలకు రూ.100 డిపాజిట్ చేసినా సరిపోతుంది. బ్యాంక్‌లో అకౌంట్ కావాలంటే డైరెక్ట్‌గా బ్యాంక్‌కు వెళ్లి ఆర్‌డీ ఖాతా తెరవొచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో ప్రతి నెలా రూ.10 ఇన్వెస్ట్ చేశామని భావిస్తే.. మెచ్యూరిటీ సమయంలో మీకు రూ.725 వస్తాయి. పోస్టాఫీస్ ఆర్‌డీ అకౌంట్‌పై 7.2 శాతం వడ్డీ వస్తుంది. పోస్టాఫీస్‌లో ఆర్‌డీ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు. అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గరి నుంచి ఐదేళ్లపాటు అకౌంట్ కొనసాగుతుంది. కావాలనుకుంటే ఆర్‌డీ అకౌంట్‌ను మరో ఐదేళ్లపాటు పొడిగించుకోవచ్చు. దీని కోసం పోస్టాఫీస్‌కు వెళ్లి అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీ వద్ద ఎంత డబ్బునా తీసుకెళ్లి పోస్టాఫీస్ ఆర్‌డీలో పెట్టుకోవచ్చు. సాధారణంగా పోస్టాఫీస్ ఆర్‌డీ నుంచి డబ్బులు తీసుకోవాలంటే మెచ్యూరిటీ కాలం వరకు ఆగాలి. అయితే అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాది తర్వాత కావాలనుకుంటే 50 శాతం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఈ డబ్బును మళ్లీ అకౌంట్‌లో జమ చేసుకోవచ్చు. ఆర్‌డీ అకౌంట్‌ను చెక్ లేదా నగదు రూపంలో డబ్బులు చెల్లించి ప్రారంభించొచ్చు. నెల 15వ తేదీలోపు అకౌంట్ తెరిస్తే వచ్చే నెల 15వ తేదీ లోపు డబ్బులు డిపాజిట్ చేయాలి. అదే 16వ తేదీ తర్వాత అకౌంట్ తెరిస్తే.. నెలలో చివరి వర్కింగ్ డే రోజులోపు డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.





Untitled Document
Advertisements