క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్‌కు ఎగబడుతున్న జనం!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 03:59 PM

క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్‌కు ఎగబడుతున్న జనం!

క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్‌కు జనాలు క్యూ కడుతున్నారు. క్రెడిట్ కార్డులను బాగా వాడేస్తున్నారు. పర్సనల్ లోన్స్ కూడా తెగ తీసేసుకుంటున్నారు. దేశంలోని ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రజలపై తీవ్ర ప్రభావమే చూపిస్తున్నాయి. ఉద్యోగాల కోత, జీతాలు ఆలస్యంగా రావడం వంటి పలు అంశాల కారణంగా క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. పర్సనల్ లోన్స్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో క్రెడిట్ బ్యాలెన్స్ వినియోగం బాగా పెరిగింది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజాగా ఇండియా రిటైల్ క్రెడిట్ ట్రెండ్స్ పేరుతో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో క్రెడిట్ జూలై- సెప్టెంబర్ మధ్య కాలంలో కార్డ్స్, పర్సనల్ లోన్స్‌కు డిమాండ్ పెరిగిందనే విషయం వెల్లడైంది. అలాగే క్రెడిట్ కార్డులపై ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ కూడా పైకి కదిలింది. అంటే కస్టమర్లు దైనందిన ఖర్చులకు కార్డులను బాగా ఉపయోగిస్తున్నారనే అంశం తేటతెల్లమౌతోంది. సిబిల్ రిపోర్ట్‌లో మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్‌కు డిమాండ్ పెరిగితే.. పలు రుణాలకు డిమాండ్ నెమ్మదించింది. మరీముఖ్యంగా వాహన రుణాలు, హోమ్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్‌కు డిమాండ్ తగ్గింది. ఆటో లోన్స్, ప్రాపర్టీ లోన్స్, హోమ్ లోన్స్‌లో వరుసగా 10 శాతం, 11 శాతం, 10 శాతం పెరుగుదల నమోదైంది. క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ అండ్ అకౌంట్స్ వార్షిక ప్రాతిపదికన చూస్తే 29.8 శాతం నుంచి 40.7 శాతానికి పెరిగాయి. యాక్టివ్ క్రెడిట్ కార్డుల సంఖ్య 4.45 కోట్లకు చేరింది. అదేసమయంలో పర్సనల్ లోన్స్‌లోనూ 28 శాతం పెరుగుదల నమోదైంది. పర్సనల్ లోన్స్ 18 నుంచి 20 ఏళ్ల వయసు మధ్య వారే ఎక్కువగా తీసుకుంటున్నారు. దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిందంటే.. కస్టమర్లు వారి రోజూవారి ఖర్చులకు కూడా కార్డులను ఉపయోగిస్తున్నారని అర్థం చేసుకోవాలని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ తెలిపారు. అంటే ప్రజల ఆదాయం తగ్గిందని, అందువల్లనే వారు కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆదాయం పెరగకుండా స్థిరంగా ఉన్నప్పుడు, అవసరాలు పెరిగినప్పుడు అప్పు లేదా రుణం కోసం ఎదురుచూడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఇలాంటప్పుడు క్రెడిట్ కార్డులు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. వీటికితోడు వ్యవస్థలో ఉద్యోగాల కల్పన ఆశాజనకంగా లేదనప్పుడు క్రెడిట్ వినియోగం అలవాటుగా మారుతుందన్నారు. ఇలాంటప్పుడు బ్యాంకులు పరిస్థితులను గమనిస్తూ ఉండాలని అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements