రాహుల్ హిట్టింగ్ వెనుక ఆ ముగ్గురు...హర్ట్ అయిన ఫ్యాన్స్

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 04:08 PM

రాహుల్ హిట్టింగ్ వెనుక ఆ ముగ్గురు...హర్ట్ అయిన ఫ్యాన్స్

శుక్రవారం ఆసిస్ తో జరిగిన రెండో వన్డేలో కేఎల్ రాహుల్ టీమిండియాని గెలిపించే ప్రదర్శన కనబర్చాడు. ప్రొఫెషనల్ ఓపెనర్ అయినప్పటికీ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కేఎల్ రాహుల్ (80: 52 బంతుల్లో 6x4, 3x6) విలువైన పరుగులు చేశాడు. దీంతో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేయగా.. ఛేదనలో ఆస్ట్రేలియా 304 పరుగులకే కుప్పకూలిపోయింది. కీపింగ్‌లోనూ ఫించ్‌ని స్టంపౌట్ చేసిన రాహుల్.. రెండు క్యాచ్‌ల్ని అందుకున్నాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్‌కి అనుగుణంగా బ్యాటింగ్‌లో గేర్లు మార్చిన రాహుల్‌పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. తాను ఏబీ డివిలియర్స్, స్టీవ్‌స్మిత్, కేన్ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ వీడియోలు చూసి ఎప్పుడు..? ఎలా..? బ్యాటింగ్ చేయాలో నేర్చుకున్నట్లు రాహుల్ వెల్లడించాడు. అయితే.. ఈ జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ పేర్లు లేకపోగా.. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీగా పోటీగా ఉన్న వారి పేర్లని రాహుల్ ప్రస్తావించడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. ‘రాజ్‌కోట్ వన్డేలో మ్యాచ్ గమనానికి అనుగుణంగా నా ఆటని మార్చుకున్నాను. మునుపటితో పోలిస్తే..? నా ఆటతీరు కూడా మెరుగైంది. దానికి కారణం.. ఏబీ డివిలియర్స్, స్టీవ్‌‌స్మిత్, కేన్ విలియమ్స్ బ్యాటింగ్ వీడియోలను చూడటమే. జట్టులో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధం. ఎందుకంటే.. ఇది టీమ్ గేమ్.. ఎవరైనా జట్టుకి ప్రయోజనాలకి లోబడి ఆడాల్సి ఉంటుంది’ అని రాహుల్ వెల్లడించాడు. గత ఏడాది చివర్లో శిఖర్ ధావన్ గాయపడటంతో.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడిన రాహుల్.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకపై టీ20ల్లో ధావన్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడాడు. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో మూడో స్థానంలో ఆడిన రాహుల్.. రాజ్‌కోట్ వన్డేలో 5వ స్థానానికి మారాడు. కానీ.. ఏ స్థానంలో ఆడించినా.. అతను నిలకడగా రాణిస్తుండటం టీమిండియాకి ఉత్సాహానిచ్చే అంశమే.









Untitled Document
Advertisements