పౌరసత్వంలో హక్కులు, బాధ్యతలు...నాగ్‌పూర్ వర్శిటీ సభలో సిజెఐ

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 11:35 AM

పౌరసత్వంలో హక్కులు, బాధ్యతలు...నాగ్‌పూర్ వర్శిటీ సభలో సిజెఐ

భారత ప్రధాన న్యాయమూర్తి షరద్ బోబ్డే ...పౌరసత్వం కేవలం ప్రజల హక్కుల కోసమే అనుకోవద్దని, బాధ్యతలను కూడా ఇది గుర్తు చేస్తుందని చెప్పారు. సమాజం పట్ల మనం నిర్వర్తించే బాధ్యతలతోనే మనకు తగు విధమైన హక్కులు సార్థకం అవుతాయని స్పష్టం చేశారు. నాగపూర్‌లోని రాష్ట్రసంత్ తుకడోజీ మహారాజ్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయ 107వ స్నాతకోత్సవ సభలో ప్రధాన న్యాయమూర్తి శనివారం ప్రధాన ప్రసంగం చేశారు. కొన్ని విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో వాణిజ్య లావాదేవీల కేంద్రాలుగా మారడం బాధాకరమైందని బోబ్డే ఆవేదన వ్యక్తం చేశారు. తాను విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడటం లేదని, కేవలం వాణిజ్యపరంగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థల గురించి చెపుతున్నానని అన్నారు. విశ్వవిద్యాలయాలంటెనే సమాజం పట్ల బాధ్యతను నేర్పేవి అని, ఈ విధానంలోనే అవి వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడైనా క్రమశిక్షణ కీలకమని, శిక్షణ క్రమంలో నుంచి వచ్చేదే క్రమశిక్షణ అని , మనిషి అధ్యయనం ఎంత సక్రమం అయితే, శిక్షణ ప్రక్రియ అత్యుత్తమమైతే అదే స్థాయిలో మనిషి క్రమశిక్షణాయుతుడు అవుతాడని ప్రధాన న్యాయమూర్తి తేల్చిచెప్పారు. విద్యతో మనిషిలో ఆలోచన అంతకు మించి సామాజిక అంశాలపై తగు విశ్లేషణలు పెరగాల్సి ఉంటుందని, మేధాయుత వ్యక్తిత్వం అలవర్చుకోవల్సి ఉంటుందన్నారు. మనిషి సరైన వికాసం దిశలో ఉండేదదే సరైన విద్యావిధానం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మార్టిన్ లూథర్ కింగ్ మాటలను ప్రస్తావించారు. విద్యాలయాలలో లభ్యమయ్యే పట్టాలతో విద్యార్థి ఒక సమగ్రమైన మనిషిగా సమాజంలో ముందుకు వెళ్లుతాడు, ఈ క్రమంలో విద్య ఒక ఊతంగా పనికివస్తుందన్నారు. డిగ్రీ అనే పనిముట్టుతో వెళ్లే వారు తమ భవితను తమకు అనువైన రీతిలో మల్చుకునేందుకు వీలుంటుంది. శిల్ప వైభవం చాటుకునేందుకు ఈ చదువు తద్వారా అందే పట్టా ఉపయోగపడుతుందన్నారు. సాధారణంగా పనిముట్లు కేవలం యంత్రాలే, వాటంతట అవి పనిచేయవు. మనలోని శక్తి, వీటిని వినియోగించుకునే మేధో సంపత్తితోనే అవి ఎంతబాగా పనిచేస్తాయనేది వెల్లడవుతుందని, ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందనేదానిని నిర్ధేశిస్తుందని తెలిపారు.





Untitled Document
Advertisements