షిరిడీలో భారీ ర్యాలీలు.. బంద్!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 01:58 PM

షిరిడీలో భారీ ర్యాలీలు.. బంద్!

సాయిబాబా జన్మస్థానంపై వివాదం కొనసాగుతున్న వేళ షిర్డీ వాసులు పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా సాగుతోంది. షిరిడీ సహా చుట్టుపక్క గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. కార్యకలాపాలన్నీ స్తంభించడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. షిరిడీలో గ్రామసభ ఆధ్వర్యంలో వ్యాపారస్థు లు, స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు, ప్రధాన ఆలయ దర్శనాలకు మాత్రం భక్తులను అనుమతిస్తున్నారు. ఆదివారం ఉదయం భక్తులు భారీ ఎత్తున సాయిబాబా దర్శనానికి వచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సాయి సంస్థాన్ ట్రస్ట్ సకల ఏర్పాట్లు చేసింది. ఈ వివాదం నెలకొనక ముందే సాయి దర్శనార్థం వివిధ ప్రదేశాల నుంచి బయలుదేరి షిరిడీకి చేరుకున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించబోమని ట్రస్టు వెల్లడించింది. షిరిడీ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకున్నట్టు ట్రస్టు సభ్యుడు బి.వాక్‌చౌరె తెలిపారు. పర్బని జిల్లా పాథ్రీలోని సాయి జన్మస్థానంలో వసతుల కల్పనకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల ప్రకటించడంతో వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. పాథ్రీ సాయిబాబా జన్మ స్థానమని చెప్పేందుకు ఆధారాల్లేవని షిరిడీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించేందుకు నిపుణులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే త్వరలో సమావేశం అవుతారని మహారాష్ట్ర సీఎంవో ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పాథ్రీ కృతి సమితి కూడా ఆదివారం నుంచి పాథ్రీలో బంద్ పాటిస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి ప్రకటన మేరకు పాథ్రీ పట్టణాన్ని అభివృద్ధి చేస్తే షిరిడీ ఆలయ ప్రాశస్త్యం తగ్గిపోతుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పాథ్రీ సాయిబాబా జన్మస్థలమన్న వ్యాఖ్యలను ఉద్ధవ్ ఉపసంహరించుకోవాలని షిరిడీ వాసులు నిరవధిక బంధ్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అయితే, షిరిడీ ఆలయం కూడా మూసేస్తారనే ప్రచారం తొలుత జరిగింది. కానీ బంద్ ప్రభావం బాబా ఆలయంపై ఉండదని, గుడి తెరిచే ఉంటుందని షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి దీపక్ మధుకర్ ప్రకటించారు. ఆదివారం ఆలయం మూసివేస్తారనే వదంతులను నమ్మవద్దని కూడా ఆయన ఓ ప్రకటనలో కోరారు.











Untitled Document
Advertisements