ద్రవిడ్ కంటే రాహుల్ మెరుగైన వికెట్ కీపర్!!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 02:13 PM

ద్రవిడ్ కంటే రాహుల్ మెరుగైన వికెట్ కీపర్!!

కేఎల్ రాహుల్ భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కంటే మెరుగైన వికెట్ కీపర్ అని టీమిండియా మాజీ క్రికెటర్, మ్యాచ్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వాంఖడే వన్డేలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ విసిరిన షార్ట్ పిచ్ బంతి రిషబ్ పంత్ హెల్మెట్‌కి బలంగా తాకడంతో అతను కీపింగ్‌కి దూరమయ్యాడు. దీంతో.. ఆ మ్యాచ్‌లో కీపర్‌గా చేసిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్ వన్డేలోనూ కీపింగ్ బాధ్యతలు చక్కగా నిర్వర్తించాడు. ముఖ్యంగా.. ధోనీ తరహాలో అరోన్ ఫించ్‌ని రెప్పపాటులో స్టంపౌట్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రిషబ్ పంత్‌పై వేటు వేసి కేఎల్ రాహుల్‌ని వికెట్ కీపర్‌గా కొనసాగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కేఎల్ రాహుల్ కీపింగ్ స్కిల్స్ గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ‘ఒకప్పటి రాహుల్ ద్రవిడ్ కంటే కేఎల్ రాహుల్ మెరుగైన వికెట్ కీపర్. అలా అని అతడ్ని రెగ్యులర్‌ వికెట్ కీపర్‌గా ఆడించాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే..? వన్డే ఫార్మాట్‌లో 50 ఓవర్ల పాటు కీపింగ్ చేసి.. ఆ వెంటనే టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం కష్టం’ అని వెల్లడించాడు. భారత్ జట్టులోకి ధోనీ అరంగేట్రం చేయకముందు రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపర్‌గా పనిచేశాడు. కానీ.. టీమ్‌లోకి ధోనీ వచ్చిన తర్వాత గ్లోవ్స్ అతనికిచ్చేసిన ద్రవిడ్.. స్లిప్స్‌లో ఫీల్డింగ్‌కి పరిమితమయ్యాడు. మరోవైపు కేఎల్ రాహుల్ దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక టీమ్‌కి, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకి కీపర్‌గా పనిచేశాడు. కానీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కీపింగ్ చేయడం ఇదే తొలిసారి.







Untitled Document
Advertisements