‘నాన్ బాహుబలి’ రికార్డు...‘సైరా’ను దాటిన బన్ని

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 05:03 PM

‘నాన్ బాహుబలి’ రికార్డు...‘సైరా’ను దాటిన బన్ని

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి వారం రోజులు ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా రూ.118.1 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన టాలీవుడ్ సినిమాగా ‘అల వైకుంఠపురములో’ నాలుగో స్థానంలో ఉంది. కాగా, ‘బాహుబలి 2’ తరవాత వారం రోజుల్లో ఇంత మొత్తం షేర్ వసూలు చేసిన ఏకైక సినిమా ‘అల వైకుంఠపురములో’. ‘బాహుబలి 2’ తరవాత తెలుగు రాష్ట్రాల్లో తొలి వారంలో అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ నిలిచింది. ఇప్పటి వరకు ‘సైరా నరసింహారెడ్డి’ పేరున ఉన్న ‘నాన్ బాహుబలి’ రికార్డును ‘అల వైకుంఠపురములో’ సొంతం చేసుకుంది. ‘సైరా’ తెలుగు రాష్ట్రాల్లో తొలి 7 రోజుల్లో రూ.83.23 కోట్ల షేర్ వసూలు చేయగా.. ‘అల వైకుంఠపురములో’ రూ.93.30 కోట్లు రాబట్టింది. కర్ణాటక మినహా అన్ని ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. కర్ణాటకలో కూడా ఆదివారం బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను దాటుందని అంచనా. ‘అల వైకుంఠపురములో’ చిత్రం అమెరికాలోనూ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. సినిమా ఫుల్ రన్‌లో 3 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫుల్ రన్‌లో చాలా నాన్-బాహుబలి రికార్డులను బద్దలుకొట్టడం ఖాయమంటున్నారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 118.10 కోట్ల షేర్ వసూలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.93.30 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అత్యధికంగా నైజాంలో రూ.28.84 కోట్లు రాబట్టింది. సీడెడ్‌లో రూ. 15.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.15.01 కోట్లు, గుంటూరులో రూ.8.58 కోట్లు, తూర్ప గోదావరిలో రూ.8.12 కోట్లు, కృష్ణాలో రూ.7.40 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.6.40 కోట్లు, నెల్లూరులో రూ.3.50 కోట్లు కొల్లగొట్టింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్, ప్రచార ఖర్చు కలుపుకుని రూ.67 కోట్లు. ఇప్పటికే ఇక్కడ రూ.93.30 కోట్లు వసూలైంది. ఇక ఓవర్సీస్‌లో రూ.9.50 కోట్లకు థియేట్రికల్ హక్కులను అమ్మారు. ఈ మార్కును కూడా బన్నీ సినిమా దాటేసింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రూ.12.25 కోట్ల షేర్ వసూలైంది.





Untitled Document
Advertisements