డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 05:51 PM

డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!

భారత క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్ కుమార్ డిప్రెషన్‌కు గురై చచ్చిపోవాలని భావించినట్లు తాజాగా తెలిపాడు. ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమిండియాలో చోటు కోల్పోయినప్పుడు తీవ్రంగా మథనపడ్డానని, ఆ సమయంలో డిప్రెషన్‌కు గురై అతి తీవ్రమైన నిర్ణయానికి కూడా సిద్ధపడినట్లు తెలిపాడు. 2007లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ప్రవీణ్ కుమార్ ఐదేళ్లపాటు జట్టు తరపున ఆడాడు. అతను ఆడిన సమయంలో ఆస్ట్రేలియాలో ముక్కోణపు వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. ఆ సిరీస్‌లో తను కీలకపాత్ర పోషించాడు. అయితే బౌలింగ్‌లో విఫలమవడంతో జట్టులో చోటు కోల్పోయిన అతను.. డిప్రెషన్‌కు లోనయ్యినట్లు తెలిపాడు. నిజానికి అది డిప్రెషన్ అని కూడా తెలియదని అభిప్రాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ప్రవీణ్.. జట్టు నుంచి కోల్పోయిన సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలిపాడు. ఆ సమయంలో తనకు డిప్రెషన్ గురించి అవగాహన లేదని, నిజానికి తమ ఊరిలోనే దీని గురించి తెలియదని పేర్కొన్నాడు. ఈక్రమంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని భావించినట్లు తెలిపాడు. ఒకసారి హరిద్వార్‌కు వెళుతుండగా.. మనసులో తీవ్ర అలజడి రేగిందని ప్రవీణ్ తెలిపాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలో సతమతమయ్యానని, ఇంతటితో జీవితాన్ని ముగించాలనుకునే తీవ్ర నిర్ణయానికొచ్చినట్లు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో తను తుపాకితో కాల్చుకోవాలనుకున్నానని ప్రవీణ్ కుమార్ వెల్లడించాడు. అయితే కారులో చిరునవ్వులు చిందిస్తూ అమయాకంగా కనబడుతున్న తన పిల్లల ఫొటోను చూసి ఆ ప్రయత్నాన్ని విరమించానని ప్రవీణ్ తెలిపాడు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. తన పిల్లలకు అన్యాయం చేయకూడదని భావించినట్లు తెలిపాడు. డిప్రెషన్‌కు గురైన సమయంలో విపరీతంగా ఆలోచించేవాణ్నని ప్రవీణ్ తెలిపాడు. ఆసమయంలో ఎడతెగని ఆలోచనలతో సతమతమయ్యేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఒక పేసర్‌గా బ్యా్ట్స్‌మెన్‌ను ఔట్ చేయడం కోసం నిరంతరరాయంగా ప్రణాళికలు వేస్తామని, తదనంతర కాలంలో క్రికెట్ ‌నుంచి దూరమైనా ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్నానని తెలిపాడు. ఈక్రమంలో సైకియాట్రిస్టు దగ్గరికి కూడా వెళ్లి తన అంతులేని ఆలోచన సరళిని వివరించినట్లు తెలిపాడు. డిప్రెషన్ సమయంలో తన నీడను చూసిన భయపడేవాణ్నని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. ఎవరికైనా కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే అప్సెట్ అయ్యేవాడనని తెలిపాడు. అయితే తన జీవితంలో ఆ దశ ముగిసిందని, త్వరలోనే తాను మునుపటి జీవితాన్ని అందుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ అందరిచేత ప్రవీణ్ ప్రశంసలు అందుకున్నాడు. అయితే రిటైరయ్యాక తనకెంతో ఇచ్చిన క్రికెట్‌కు సేవచేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే ఉత్తరప్రదేశ్ రంజీ జట్టుకు బౌలింగ్ కోచ్ లేడని తెలుసుకుని, ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు. దాంతో డిప్రెషన్‌ నుంచి బయటపడ్డట్లు తెలిపాడు. 2007 నవంబర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మార్చి 30, 2012లో సౌతాఫ్రికాపై తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఐదేళ్ల తన కెరీర్‌లో ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి112 వికెట్లు తీశాడు. బంతిని రెండువైపులా స్వింగ్ చేయగల అతికొద్ద మంది బౌలర్లలో ఒకరిగా తను పేరు తెచ్చుకున్నాడు.





Untitled Document
Advertisements