చట్టసభలను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవు!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 07:45 PM

చట్టసభలను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవు!

ఏపీ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ జేఏసీ అసెంబ్లీ ముట్టడి పై శాసన సభాపతి తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంపై తీవ్రంగా స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వమ్య వ్యవస్థలో చట్టసభలది కీలక పాత్ర అని.. అలాంటి చట్టసభలను జరగకుండా అడ్డుకోవాలని చూడడం నేరంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. చట్ట సభలను అడ్డుకోవడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని.. అందుకు చట్టపరమైన చర్యలు ఉంటాయని తమ్మినేని హెచ్చరించారు. నిరసన వ్యక్తీకరణ కూడా చట్టాలకు లోబడి ఉండాలన్న తమ్మినేని.. అసెంబ్లీ ముట్టడిస్తామంటూ రాజ్యంగ వ్యవస్థలను బెదిరించడాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీని ముట్టడిస్తాం.. కట్టడి చేస్తాం.. దాడి చేస్తాం అంటే అది నేరమవుతుందని గ్రహించాలని.. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని తీవ్ర హెచ్చరికలు చేశారు. సభను నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అవుతుందని.. సభా హక్కులను హరించడమేనని తమ్మినేని అభిప్రాయపడ్డారు. సభ జరగకుండా అడ్డుకునే యత్నాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ప్రజలు వారి అభిప్రాయలు చెప్పినట్లే.. శాసన సభ్యులు కూడా వారి అభిప్రాయాలు చెప్పుకోవాలన్నారు. రేపు జగన్ క్యాబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో హైటెన్షన్ నెలకొంది. అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో భారీగా పోలీసులను మోహరించారు. టీడీపీ నేతలు.. జేఏసీ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్లే రోడ్డులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.







Untitled Document
Advertisements