వందల మంది ఆత్మహత్యలకు కారణమైన పాట! ఎలాగో తెలుసా?

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 08:16 PM

వందల మంది ఆత్మహత్యలకు కారణమైన పాట! ఎలాగో తెలుసా?

ఒకరు, ఇద్దరు ఏకంగా వందలాది మంది వంతెనలు, భవనాల మీదకు ఎక్కి దూకేసేవాళ్లు. అలా వందలాది మంది వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది ప్రాణాలతో బయటపడగా.. కొందరు ప్రాణాలు విడిచేవారు. ఎక్కువ మంది నీటిలోకి దూకే చనిపోయేవారు. వారిని ఆపేందుకు పోలీసులు పెద్ద బలగమే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అది 1930వ సంవత్సరం హంగేరీలోని బుడాపెస్ట్ ప్రజలు అప్పుడప్పుడే ఒకటో ప్రపంచ యుద్ధం నుంచి తేరుకుంటున్నారు. అప్పటికే ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆ దేశాన్ని అనుకోకుండా మరో సమస్య వెంటాడింది. ఏమైందో ఏమోగానీ క్రమేనా దేశమంతటా ఆత్మహత్యలు చేసుకొనేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆత్మహత్మలకు గల కారణాలు ఏమిటనేది ఎవరికీ తెలియరాలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకొనేవారు. బుడాపెస్టులోని నదుల్లో పోలీసులు రేయింబవళ్లు పహారా కాసేవారు. ఎవరై నదిలోకి దూకేస్తే వెంటనే కాపాడేవారు. ఇలా ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కానీ, ప్రజల ఆత్మహత్య ప్రయత్నాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. కేవలం బుడాపెస్ట్‌లోనే కాకుండా హంగేరీలోని ఇతర నగరాల్లో కూడా ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. ప్రజలు అలా ఆత్మహత్యలు చేసుకోడానికి కారణం.. కుంగుబాటుతనం (డిప్రషన్) అని భావించారు. దీంతో ప్రజలకు కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. అయితే, అప్పటికీ మార్పు రాలేదు. యుద్ధం వల్ల ప్రజలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? యుద్ధ సమయంలో జరగని ఆత్మహత్యలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని ప్రభుత్వం దీర్ఘాలోచనలో పడేసింది. ఆత్మహత్యలకు కారణం తెలుసుకోడానికి వైద్యులు, పోలీసులు, ఇతరాత్ర శాఖల అధికారులతో కలిపి ప్రభుత్వం ఓ విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆత్మహత్యల నుంచి బయటపడి కౌన్సెలింగ్ పొందినవారిని వారు డ్రిప్రషన్‌లోకి జారుకోడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. విచారణలో బాధితులు ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. నిత్యం రేడియోలో వచ్చే ‘గ్లూమీ సండే’ అనే పాట విన్న తర్వాత తమలో ఏదో తెలియని ఆందోళన కలిగేదని, ఆత్మహత్యకు పురిగొలిపేదని తెలిపారు. దీంతో అధికారులు వెంటనే రేడియోల్లో ఆ పాట ప్రసారాన్ని నిలిపివేశారు. రెజెసో సెరెస్ అనే సంగీత దర్శకుడు స్వరపరిచిన ఈ పాటను ఆత్మహత్యలకు పురిగొలిపిందనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. చివరికి ఆ పాట ‘హంగేరియన్ సూసైడ్ సాంగ్’గా చరిత్రలో నిలిచిపోయింది. అయితే, 1941లో బీబీసీ బిల్లీ హాలీడే వెర్షన్ పేరిట పాటను విడుదల చేసింది. వరుస ఆత్మహత్యల వల్ల బుడాపెస్ట్‌కు ఆత్మహత్యల నగరంగా పేరొచ్చింది. దీంతో ఆ పేరును చరిత్ర నుంచి తుడిచేసే లక్ష్యంతో ‘స్మైల్ క్లబ్’ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజల డిప్రషన్ తొలగించి, నవ్వడం నేర్పేవారు. ఈ సందర్భంగా మోనాలిసా చిత్రాలతోపాటు.. పలువురు హాలీవుడ్ నటులు నవ్వుతున్న చిత్రాలను వారికి చూపించేవారు. ముఖం మీద చిరునవ్వు ఉంటే.. డిప్రషన్ ధరిచేరదని బోధించేవారు. పాఠశాలల్లో సైతం ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఆత్మహత్యలు సంగతి పక్కన పెడితే.. అక్కడి ప్రజలు స్మైలీ మాస్కులు ధరించడం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. స్మైలీ లిప్స్ మాస్కులను ధరించి.. తాము నవ్వితే అద్దాల్లో ఎలా ఉంటామో చూసుకోవడానికి ప్రయత్నించేవారని అప్పటి పత్రికలు వెల్లడించాయి. అయితే, అది ఎంత వరకు నిజమనేది మాత్రం చరిత్రకే తెలుస్తోంది. ఎందుకంటే.. అప్పట్లో వార్తా పత్రికలు ఈ అంశాన్ని సొమ్ముచేసుకొనే ప్రయత్నంలో ఈ మాస్కులు అందించేవని సమాచారం. ఏది ఏమైనా.. ఒక పాట ప్రజల మనసును వికలం చేసిందంటే నిజంగా ఆశ్చర్యకరమే. మరి, బుడాపేస్ట్ ఆత్మహత్యలకు కారణం నిజంగా ఆ పాటేనంటారా? లేదా దీని వెనుక ఏదైనా మిస్టరీ దాగి ఉందా? ఆ పాటను మీకు కూడా వినాలని ఉంటే కింది వీడియోను చూడండి. కానీ, జాగ్రత్త.. సినిమాల్లో బాధ కలిగించే పాటలు కూడా మనసు వికలం చేస్తుంటాయి. ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన కలిగితే.. వెంటనే మీ మిత్రులు, ఆప్తుల సాయం పొందండి. హెల్ప్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ పొందండి. ఎవరైనా డిప్రషన్‌‌లో ఉన్నట్లయితే.. వారి బాధను తొలగించే ప్రయత్నం చేయండి.





Untitled Document
Advertisements