రుణాలను చెల్లిస్తానన్నా బ్యాంకులు తిరస్కరించాయి

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:02 PM

రుణాలను చెల్లిస్తానన్నా బ్యాంకులు తిరస్కరించాయి

పరారీలో ఉన్న ఆర్ధిక నేరగాడు, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా బ్యాంకు బాకీల కోసం ఒక్క పైసా కూడా చెల్లించలేదని సుప్రీకోర్టు పేర్కొంది. ‘‘ఒక్క పైసా కూడా రాలేదు..’’ అని ఈ కేసును విచారించిన జస్టిస్ రోహింటన్ నారీమన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ఆయన ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. అనంతరం విజయ్ మాల్యా ఆస్తుల కోసం జరుగుతున్న ఈ పిటిషన్ విచారణ బాధ్యతలను చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టింది. ఈ కేసు విచారణ కోసం త్వరలోనే కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీజే బాబ్డే పేర్కొన్నారు.

కాగా తన ఆస్తుల స్వాధీనంపై స్టే విధించాలంటూ గతేడాది జూన్‌లో మాల్యా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై విచారణ సంస్థలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవనీ.. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం తాను తీసుకున్న రుణాలను చెల్లిస్తానన్నా బ్యాంకులు తిరస్కరించాయని ఆయన సుప్రీంకు చెప్పుకొచ్చారు. మరోవైపు విజయ్ మాల్యా, ఆయన కంపెనీలు ఏళ్ల తరబడి రుణాలు చెల్లిస్తామని చెబుతూ.. ఇప్పటి వరకు ‘‘ఒక్క పైసా కూడా చెల్లించలేదని’’ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇటీవల విచారణ సందర్భంగా సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.

రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలను ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా.. కోర్టు విచారణ నుంచి తప్పించుకునేందుకు 2016లో బ్రిటన్ పారిపోయారు. ఆయనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా గతేడాది ఢిల్లీ కోర్టు ప్రకటించింది. ఆయన ఆస్తుల స్వాధీనం కోసం విచారణ ప్రారంభించింది. అయితే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తప్ప మరే ఇతర ఆస్తులను స్వాధీనం చేయలేరంటూ మాల్యా వాదిస్తున్నారు. కాగా అక్రమ లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ముంబై ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించాలంటూ విజయ్ మాల్యా పెట్టుకున్న పిటిషన్‌ను కూడా బోంబే హైకోర్టు గత నెలలో కొట్టివేసింది.





Untitled Document
Advertisements