ధోనీని వెనక్కినెట్టి అత్యంత వేగంగా విరాట్ రికార్డ్!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:16 PM

ధోనీని వెనక్కినెట్టి అత్యంత వేగంగా విరాట్ రికార్డ్!

అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ దూసుకుపోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు. అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా కోహ్లీ ఈ రికార్డును చేరుకున్నాడు. ఈక్రమంలో ఎంఎస్ ధోనీని వెనక్కినెట్టి అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. మరోవైపు ఇదే మ్యాచ్‌లో వన్డేలలో 5వేల పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన కెప్టెన్‌గాను కోహ్లీ వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం. ఈ రికార్డు కూడా ధోనీ పేరిటే ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో 89 పరుగులు చేసిన కోహ్లీ.. అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు దక్కించుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 199 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. 11,208 పరుగులు చేశాడు. దీంతో అగ్రస్థానంలో ఉన్న ధోనీని వెనక్కినెట్టి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ధోనీ 330 ఇన్నింగ్స్‌ల్లో 11,207 పరుగులు చేయగా.. కోహ్లీ మాత్రం అతనికి కంటే 131 తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఇన్ని పరుగులు చేయడం విశేషం.




భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాను పరిశీలిస్తే కోహ్లీ, ధోనీ టాప్-2లో నిలిచారు. మూడో స్థానంలో హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ అజారుద్దీన్ నిలిచాడు. 230 ఇన్నింగ్స్‌ల్లో అజార్. 8,095 పరుగులు చేశాడు. నాలుగోస్థానంలో ప్రస్తుత బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ నిలిచాడు. కెప్టెన్‌గా 217 ఇన్నింగ్స్ ఆడిన దాదా.. 7,683 పరుగులు చేశాడు. మరోవైపు కొత్త ఏడాదిలో భారత్ వరుసగా రెండో సిరీస్ దక్కించుకుంది. జనవరి తొలివారంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను 2-0తో భారత్ దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియాతో రెండో వారంలో ప్రారంభమైన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. భారత్ తర్వాతి లక్ష్యం న్యూజిలాండ్ పర్యటన కావడం విశేషం. ఈనెల 24 నుంచి కివీస్ గడ్డపై ఆ జట్టుతో ఐదు టీ20ల సిరీస్‌ను ఆడుతుంది. అనంతరం మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.





Untitled Document
Advertisements