అసెంబ్లీలో జగన్‌‌‌పై రాపాక పొగడ్తలు...పవన్ ను ధిక్కరించి మరీ బిల్లుకు మద్దతు!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 05:16 PM

అసెంబ్లీలో జగన్‌‌‌పై రాపాక పొగడ్తలు...పవన్ ను ధిక్కరించి మరీ బిల్లుకు మద్దతు!

ఏపీ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు జనసేన పార్టీ ఎమ్మెల్యే. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఉన్నతమైన ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్ అంటూ కితాబిచ్చారు. ఉన్నతమైన వ్యక్తులకు ఉన్నతమైన ఆలోచనలు వస్తాయని.. అభివృద్ధి ఒకచోట కేంద్రీకృతమైతే.. ఆ ప్రాంత ప్రజలే అభివృద్ధి చెందుతారని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఈ నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అన్నారు. ఏపీ డిసెంట్రలైజేషన్‌ అండ్‌ ఈక్వల్‌ డెవలప్‌మెంట్ రీజియన్‌ యాక్ట్‌ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా రాపాక మాట్లాడారు. జనసేన ఎమ్మెల్యే ఈ సందర్భంగా విభజన సమయంలోని అంశాలను ప్రస్తావించారు. గతంలో అనుభవం ఉంది.. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆదాయాన్ని తీసుకెళ్లి హైదరాబాద్‌లో పెట్టారని.. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. అక్కడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నారని.. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల నుంచి కూలీలు పక్క రాష్ట్రాలు, జిల్లాలకు వలస వెళ్లేవారన్నారు. అలాంటి వారికి తినడానికి తిండి కూడా ఉండదన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ అలాంటి వలసలు వెళ్లే ప్రాంతంలో ఉన్న విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తే వలసలు ఆగిపోతాయన్నారు రాపాక. వలస వెళ్లేవారికి ఉపాధి దొరుకుతుందన్నారు.. దీనిపై ప్రతిపక్షం కూడా ఆలోచించాలి.. వ్యతిరేకించడం సరికాదు అన్నారు. అధికార పార్టీ ఏదో చేసిందని వ్యతిరేకించాలి అనేది సరికాదన్నారు. అమరావతిలో జరిగిన అవినీతిపై కూడా విచారణ జరిపించాలని.. చంద్రబాబు ఉద్యమం చేస్తుంటే రాజధాని వెళ్లిపోతుందని బాధ అనుకున్నారని.. సొంతవారికి భూములు కేటాయించారని.. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలిసిందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్.. గెలిచిన తర్వాత వరుసగా పథకాలు అమలు చేస్తున్నారని.. అమ్మఒడికి డబ్బు ఎలా వస్తుందని అందరూ ఆలోచించారని.. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ప్రశసించారు జనసేన ఎమ్మెల్యే. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని.. అది ఓ చరిత్ర.. అంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం అద్భుతం అన్నారు. జగన్‌కు చిన్న వయసు.. అనుభవం లేదన్నారని.. అనుభవం కాదు ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ఉండాలి అన్నారు రాపాక. పదవిలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావాలనే పనిచేస్తున్నారని.. ఉన్నతమైన ఆలోచనలు చేసేవారికి మద్దతు ఇవ్వాలన్నారు. ప్రజల్లో ఓటింగ్ పెట్టమంటున్నారని.. కానీ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నారన్నారు. ప్రజల అభిప్రాయమే తన అభిప్రాయమని.. బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తాను అన్నారు.








Untitled Document
Advertisements