మసీదులో హిందూ జంటకు పెళ్లి చేసిన ముస్లిం ప్రజలు!!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 05:19 PM

మసీదులో హిందూ జంటకు పెళ్లి చేసిన ముస్లిం ప్రజలు!!

మన దేశంలో మతసామరస్యాన్ని ప్రతిబింబించేలా గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా హిందు పండుగ వేళల్లో ముస్లిం సోదరుల వేడుకలు, రంజాన్ వేళ హిందు అన్నదమ్ముల అన్నదానాలు.. ఇలా కొన్ని ప్రాంతాల్లో జరిగాయి. తాజాగా కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుక ‘మతాల కన్నా.. మనమంతా ఒక్కటే’ అన్నట్టు పెళ్లికొచ్చిన పెద్దలతోపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆనందంలో ముంచెత్తించింది. కేరళలోని చేరావలి మస్జిద్ పక్కనే ఓ నిరుపేద హిందూ కుటుంబం నివసించేది. ఆ కుటుంబ పెద్ద తండ్రి చనిపోవడంతో కూతురి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆ తల్లిపై పడింది. ఆ కూతురు పెళ్లి చేయడానికి తల్లికి తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఏంచేయాలో తోచక సమీపంలో ఉన్న మస్జిద్ కమిటీ వారికి తమ బాధను చెప్పుకుంది. వారి ఆర్ధిక స్థితి గురించి తెలుసుకున్న ఆ కమిటీవారు తమ సభ్యులతో చర్చలు జరిపి .. ఓ ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆ అల్లా కూడా సంతోషిస్తాడనుకున్నారు. ఆ అమ్మాయి(అంజు) పెళ్లి బాధ్యతను తామే తీసుకున్నారు. మసీదు ప్రాంగణంలోనే పూర్తి హిందూ సాంప్రదాయం ప్రకారం పురోహితులను పిలిచి అంజు, శరత్ లకు పెళ్లి జరిపించారు. 1000 మంది అతిథులకు విందు భోజన ఏర్పాట్లను కూడా చేశారు. అంతే కాదు.. ఆ నవ వధువుకు 10 సవర్ల బంగారు నగలతో పాటూ, 2 లక్షల రూపాయలు నగదు ఇచ్చారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దృశ్యం చూపరులకు కనువిందు కలిగించింది. “ఈ రోజు ఇది ప్రపంచానికి ఒక ఉదాహరణ. ఒక హిందూ జంట మసీదు ప్రాంగణంలో వివాహం చేసుకున్నారు ”అని మసీదు కమిటీ కార్యదర్శి నజుముదీన్ అలుమ్మూటిల్ అన్నారు. నూతన వధూవరులను ముస్లిం, హిందూ మత పెద్దలు దీవించారు. మసీదులో పెళ్లి చేసుకున్న ఈ కొత్త జంటను కేరళ సిఎం పినరయి విజయన్ కూడా అభినందించారు. ట్విటర్ ద్వారా జంటను ఆశీర్వదిస్తూ.. “ఐకమత్యానికి ఇదొక ఉదాహరణ. చేరావల్లి ముస్లిం జమాత్ మసీదు అంజు శరత్ ల హిందూ వివాహాన్ని నిర్వహించింది. అంజు తల్లి వారి నుండి సహాయం కోరిన తరువాత మసీదు వారి సహాయానికి వచ్చింది. నూతన వధూవరులు, కుటుంబాలు, మసీదు అధికారులు మరియు చేరావల్లి ప్రజలకు నా అభినందనలు” అని తెలిపారు.









Untitled Document
Advertisements