‘డిస్కోరాజా’కి U/A సర్టిఫికెట్...ట్రైలర్ సంగతేంటో!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 08:58 PM

‘డిస్కోరాజా’కి U/A సర్టిఫికెట్...ట్రైలర్ సంగతేంటో!

మాస్ మహారాజా రవితేజ మరోసారి ‘డిస్కోరాజా’ వంటి విభిన్నమైన చిత్రాన్ని ఎంపిక చేసుకున్నారు. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘డిస్కోరాజా’ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి. ఇదిలా ఉంటే, విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా ఇప్పటి వరకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే రెండు టీజర్లు విడుదల చేశారు. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ విడుదల చేస్తారేమోనని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. మేకింగ్ వీడియోను మాత్రమే వదిలారు. ఈరోజు ‘ఫ్రీక్ ఔట్’ పేరిట మరో ప్రమోషన్ వీడియోను విడుదల చేస్తున్నారు. దీన్నే ట్రైలర్ అనుకోవాలా? లేకపోతే ట్రైలర్ వేరుగా విడుదల చేస్తారా? అసలు ట్రైలరే లేకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? అనే విషయాలు అంతుచిక్కడం లేదు. బహుశా ట్రైలర్ లేకుండా సినిమాను విడుదల చేయడం కూడా దర్శకుడి ప్రణాళికలో భాగమేమో. ఏదేమైనా ట్రైలర్ ఇప్పటికే విడుదల చేసుంటే సినిమాపై అంచనాలు మరోలా ఉండేవి. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఆయన అందించిన పాటలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ‘నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో’ పాట విపరీతంగా ఆకట్టుకుంది. మిగిలిన పాటలు కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా అదిరిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. రవితేజతో ‘నేల టికెట్’ వంటి డిజాస్టర్‌ను నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు.







Untitled Document
Advertisements