మున్సిపోల్స్​...క్లాస్​ పీపుల్​కు కాస్ట్​లీ లిక్కర్​.. మాస్​పీపుల్​కు చీప్​ లిక్కర్

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 12:06 PM

మున్సిపోల్స్​...క్లాస్​ పీపుల్​కు కాస్ట్​లీ లిక్కర్​.. మాస్​పీపుల్​కు చీప్​ లిక్కర్

మున్సిపల్​ ఎన్నికలనేపథ్యంలో లీడర్లు ఓటర్లకు పంచుడు కార్యక్రమం షురూ జేశారు. మనీ, మందు, మటన్, చికెన్​, గిఫ్టులు.. ఇట్ల ఒక్కటేంది మస్తుగా పంచిపెట్టారు. ఓటర్లను క్యూలో నిలబెట్టి మరీ నడి బజార్లలో పంపకాలు సాగించారు. అధికార పార్టీ నేతలు సోమవారం ఇట్ల పలుచోట్ల డబ్బులు పంచుతున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టాయి. గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలోని పోస్ట్ ఆఫీస్ వీధిలో టీఆర్​ఎస్​ క్యాండిడేట్​కు మద్దతుగా ఓ వ్యక్తి పట్టపగలు ఇల్లిల్లూ తిరుగుతూ డబ్బు పంచుతుండగా, ప్రతిపక్ష నేతలు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ చేతిలో పాంప్లేట్లు, మరో చేతిలో రూ. 500 నోట్ల కట్టలు పట్టుకొని ఉన్న ఆ నేతను వీధుల్లో తిప్పుతూ.. ‘టీఆర్​ఎస్​ డౌన్​ డౌన్​’ అంటూ నినదించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 2వ వార్డు నుంచి అధికార పార్టీ క్యాండిడేట్​గా పోటీ చేస్తున్న పస్తం హనుమంతు అన్న జంపయ్య ఓ కులానికి చెందిన ఓట్లను గంపగుత్తగా కొన్నాడు. కులపెద్ద చేతిలో రూ. 2లక్షల 44 వేలు పెట్టి, దేవుళ్ల మీద ప్రమాణం చేయించుకున్నాడు. వనపర్తి మున్సిపాలిటీలోని జంగడిపురంలో టీఆర్​ఎస్​ క్యాండిడేట్​ 300 మంది ఓటర్లను క్యూలో నిలబెట్టి టోకెన్లు పంపిణీ చేశాడు. వారంతా పాత బస్టాండ్​ సమీపంలోని ఓ దుకాణంలో వాటిని చూపి రూ. 2వేలు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు తీసుకున్నారు. అది చౌటుప్పల్​ మున్సిపాలిటీలోని 16వ వార్డు. మొత్తం 1,023 ఓట్లున్నాయి. అధికారపార్టీతో పాటు కమ్యూనిస్టులు, బీజేపీకి చెందిన అభ్యర్థులు మొత్తం నలుగురు బరిలో నిలిచారు. ఇందులో ఇద్దరు రియల్ ఎస్టేట్​ వ్యాపారులు. ఒకరు ఓ పార్టీ చైర్​పర్సన్​ అభ్యర్థి. ఇతడ్ని మరో అభ్యర్థి ఎన్నికల్లో బలంగా ఢీ కొడుతున్నాడు. ఇందులో ఓ అభ్యర్థి ఇప్పటికే ఓటుకు రూ. 10 వేల చొప్పున పంచాడని, మరో అభ్యర్థి రూ. 15వేల చొప్పున పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో మొదటి అభ్యర్థి మరో రూ.10 వేల చొప్పున పంచేందుకు రెడీ అయ్యాడట. ఇప్పటికే సంక్రాంతి పండుగకు ముందు స్వీట్​ బాక్సులు, మందు బాటిళ్లు, ఇంటికి వెయ్యి చొప్పున పంచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ల కాళ్లు మొక్కడం, దేవుడి మీద ప్రమాణం చేయించడం ఇక్కడ పరిపాటిగా మారింది. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని బంగారుగడ్డ 30వ వార్డులో సోమవారం ఎమ్మెల్యే ప్రచారం ముగించారు. కొద్దిసేపటికే టీఆర్​ఎస్​ క్యాండిడేట్ ఇంట్లో ఓటర్లకు టోకెన్లు ఇచ్చారు. వాటిని తిరిగి ఇచ్చినవారికి రూ. 500 నుంచి 600 వరకు పంపిణీ చేశారు. పట్టపగలు ఓటర్లను క్యూలో నిలబెట్టి డబ్బులు పంచుతున్నా సమీపంలోని ఆఫీసర్లు చోద్యం చూశారు తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే వార్డులో కాంగ్రెస్​కు చెందిన నాయకులు మందు పంపిణీ చేసేందుకు సిద్ధం కాగా, క్షణాల్లో ఫ్లయింగ్​ స్వ్వాడ్​ ఆఫీసర్లు పట్టుకొని టుటౌన్​ పోలీసులకు అప్పగించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం మున్సిపల్​ క్యాండిడేట్​ రూ. లక్ష, కార్పొరేషన్​ క్యాండిడేట్​ రూ. లక్షన్నరకు మించి ఖర్చు చేయడానికి వీల్లేదు. ఎలక్షన్ ఖర్చు ఇంతకు మించితే క్యాండిడేట్​ను డిస్ క్వాలిఫై చేయవచ్చు. ఈ క్రమంలో క్యాండిడేట్లు చేసే ఖర్చుపై నిఘా పెట్టేందుకు ఒక పోలీస్​ ఆఫీసర్​, ఒక రెవెన్యూ ఆఫీసర్, ఒక వీడియోగ్రాఫర్ తో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్, షాడో అబ్జర్వర్స్​ను ఎలక్షన్​ కమిషన్​ నియమించింది. క్యాష్​, లిక్కర్​ పంపకాలకు సంబంధించి వీరిచ్చే వీడియో, ఆడియో సాక్ష్యాలను మోడల్ కోడ్ ఆఫీసర్లు నిర్ధారించి క్యాండిడేట్లపై చర్యలు తీసుకోవాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని షాడో అబ్జర్వర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికార పార్టీ గుప్పిట్లో ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలకు బలం చేకూరేలా చాలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిఘా టీమ్​ల జాడ తెలియడంలేదు. నగదు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు ఈసారి ఎక్కడా చెక్​పోస్టులను ఏర్పాటుచేయలేదు. దీంతో క్యాండిడేట్లు ఓటర్లపై క్యాష్​, లిక్కర్​ కుమ్మరిస్తున్నారు. తమకు అందుతున్న ఫిర్యాదుల మేరకు పలు చోట్ల సోదాలు చేపట్టామని, మద్యంతోపాటు కానుకలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే వీటి వివరాలేవీ వెల్లడించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం, ప్రలోభాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌కు 60 కంప్లైంట్లు రాగా, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై 79 ఫిర్యాదులు అందినట్లు ఆఫీసర్లు చెప్పారు. ఏకగ్రీవాలపై అందిన ఫిర్యాదులను కలెక్టర్లు, ఎన్నికల అబ్జర్వర్లు పరిశీలించారని, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్‌లు విత్‌డ్రా చేసుకున్నట్లు నేతలు అబ్జర్వర్లకు చెప్పలేదని ఎన్నికల ఆఫీసర్లు అన్నారు. తమకిచ్చి తామే విత్​డ్రా చేసుకున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ఈ మున్సిపాలిటీ.. ఆ కార్పొరేషన్​ అనే తేడా లేదు. ఈ వార్డు.. ఆ డివిజన్​ అనే భేదం లేదు. ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన సోమవారం ఎక్కడ చూసినా కోట్ల రూపాయలు చేతులు మారాయి. మద్యం ఏరులై పారింది. మంగళవారం నిఘా ఎక్కువ ఉంటుందనే అనుమానంతో సోమవారం ఉదయం నుంచే క్యాండిడేట్లు ఇలా రెచ్చిపోయారు. నడివీధుల్లో నగదు పంపకాలు, పైసలు చేతిలోపెట్టి ఒట్లు వేయించుకోవడాలు, ఓటర్లను క్యూలలో ఉంచి నగదు, మద్యం టోకెన్లు అందజేస్తున్న దృశ్యాలే కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్​ మీడియాలో హల్​చల్​ చేశాయి. అందులో మచ్చుకు కొన్ని చూస్తే.. జనగామ మున్సిపాలిటీలోని 3, 18, 20, 26 వార్డుల్లో ఓటుకు రూ.1500 నుంచి 3వేల చొప్పున పంచారు. ఈ నాలుగూ జనరల్​ వార్డులు కావడంతో ఈ రేటు పలికింది. మిగిలిన వార్డుల్లో రూ.500 చొప్పున ఇచ్చారు. మిర్యాలగూడలోని అన్ని వార్డుల్లో ఓటుకు రూ. వెయ్యి నుంచి 2వేల దాకా పంచారు. క్లాస్ పీపుల్ ఉన్న చోట బ్లెండర్ స్ప్రెడ్​ మందు, మాస్ పీపుల్​ ఉన్న చోట చీప్​​ లిక్కర్​ పంపిణీ చేశారు. కాగజ్​నగర్​ మున్సిపాలిటీలో టీఆర్​ఎస్​ క్యాండిడేట్లు ఓటుకు వెయ్యి నుంచి 2 వేల వరకుఇచ్చారు. నగదు, మద్యం పంపిణీ కోసం టీమ్​లు ఏర్పాటు చేశారు. క్యాష్​, లిక్కర్​ ఓటరు చేతిలో పెట్టి ఫోన్​ చేసి క్యాండిడేట్లతో మాట్లాడించారు. నిర్మల్​లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటుకు 1,500, బ్లెండర్​ స్త్రైడ్ క్వార్టర్​ బాటిల్ పంచారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ లోని 10, 13 వార్డుల్లో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 5 వేల చొప్పున పంపిణీ చేశారు. మెదక్ మున్సిపాలిటీలోని 6, 12 వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేల చొప్పున పంచారు. రామాయంపేట మున్సిపాలిటీ లోని 3, 4 వార్డుల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓటర్లకు రూ. 3 వేల చొప్పున పంపిణీ చేశారు. 9 వ వార్డులో రూ. 2 వేల చొప్పున అందజేశారు. కరీంనగర్‍ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఓ పార్టీ అభ్యర్థి ఓటుకు రూ.5 వేల చొప్పున పంచుతుండగా, 7వ వార్డులో పోటీచేస్తున్న ఓ క్యాండిడేట్​ ఇంటింటికీ హాఫ్​ బాటిల్​ రాయల్​ స్టాగ్​ ఇచ్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 10,11, 21 వ నంబరు వార్డుల్లో ప్రతి ఓటరుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల దాకా పంపిణీ చేశారు. 21వ వార్డులో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న కుటుంబానికి ఎన్నికల తర్వాత ఫ్రిడ్జ్ ఇస్తామని టీఆర్ఎస్ అభ్యర్థి హామీ ఇచ్చారు. మధిర మున్సిపాలిటీలోని 18వ వార్డులో ఒక పార్టీ క్యాండిడేట్​ తరపున ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తుండగా, దీన్ని గమనించిన మరో పార్టీ క్యాండిడేట్​ ఓటుకు రూ.2 వేల చొప్పున పంచాడు. 3వ వార్డులో ఒక కమ్యూనిటీకి చెందిన 30 ఓట్లుండగా, ఒక పార్టీ నేత రూ.3 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఇంకా బేరసారాలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో టీఆర్​ఎస్​ నేతలు సింగరేణి కార్మికకుటుంబాలకు కిలో చికెన్​, క్వార్టర్​ బాటిల్స్​ పంపిణీ చేశారు. మహబూబాబాద్​లోని19వార్డులో ఓ పార్టీ అభ్యర్థి ఓటుకు 3500 చొప్పున పంచాడు. 35 వ వార్డులో రియల్టర్ రూ.5వేల వరకు, తొర్రూర్​ లో 14వ వార్డు లో ఓ పార్టీ అభ్యర్థి ఓటుకు రూ. 2500 చొప్పున చెల్లించాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ 3వ వార్డులో ఓ పార్టీ అభ్యర్థి మహిళలకు చీరలతో పాటు గ్రాము బంగారం ఇస్తున్నాడు. అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నఓ రియల్టర్ ప్రతి మహిళా ఓటరుకు చీర, పురుషులకు మద్యం బాటిల్, ఓటుకు రూ.2వేలు అందజేశాడు. కామారెడ్డి కొత్త పట్టణం రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న వార్డులో ఓ పార్టీ క్యాండిడేట్ మహిళలకు చీరల టోకెన్లు, వెండి కుంకుమ భరిణెలు పంపిణీ చేశాడు. ఫలనా షాపుకెళ్లి టోకెన్ చూపితే చీరలు ఇస్తారని చెప్పాడు. ఇటీవల విలీనమైన గ్రామంలో ఇండిపెండెంటుగా పోటీచేస్తున్న ఓ అభ్యర్థి ఇంటింటికీ బిర్యానీ కిట్ పంపిణీ చేశాడు. ఇందులో కిలో బాస్మతీ రైస్, బిర్యానీ మసాలాలు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కిలో చికెన్ ఉన్నాయి. పాత పట్టణంలోని కీలకమైన ఓ వార్డులో ఇద్దరు అభ్యర్థులు హోటళ్లలో దావత్ టోకెన్లు అందజేశారు.








































Untitled Document
Advertisements