మూడు రాజధానుల బిల్లుకు చిక్కులు?

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 03:22 PM

మూడు రాజధానుల బిల్లుకు చిక్కులు?

ఏపీ రాజధానికి సంబంధించిన బిల్లులకు అసెంబ్లీలో ఆమోద ముద్ర పడింది. మొదటి రోజే జగన్ సర్కార్ ఆ లాంఛనాన్ని పూర్తి చేసింది. ఇప్పుడు శాసనమండలిలో జగన్ సర్కార్ అసలు పరీక్ష ఎదుర్కోబోతోంది. మంగళవాళం బిల్లు మండలికి చేరుతుంది.. చర్చ జరగనుంది. మరి అక్కడ బిల్లు ఆమోదం పొందుతుందా.. లేదా అనేది ఉత్కంఠరేపుతోంది. దీనికి కారణం టీడీపీకి మండలిలో మెజార్టీ సభ్యులు ఉండటమే. అమరావతికి మద్దతుగా ఉన్న టీడీపీ మండలిలలో ఈ బిల్లును అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీకి బలం ఉండటంతో.. అక్కడ బిల్లును ఆమోదం పొందకుండా చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా లెక్కల్ని చూస్తే.. మొత్తం సభ్యులు 58. టీడీపీ 28, వైసీపీ 9, పీడీఎఫ్ 5, ఇండిపెండెంట్ 3, నామినేటెడ్ 8, బీజేపీ 2.. ఖాళీగా 3 స్థానాలు ఉన్నాయి. చంద్రబాబు కూడా ఆదివారం జరిగిన టీడీఎల్పీ భేటీలో ఎమ్మెల్సీలతో చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు మండలిలో టీడీపీ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మండలిలలో బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ ప్రయత్నాలు చేస్తే.. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును తిరస్కరించి వెనక్కి పంపొచ్చు. ఎందుకంటే ఇటీవల ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన బిల్లు ఇలాగే వెనక్కు వచ్చింది. ఒకవేళ ఇదే జరిగితే.. శాసనసభలో రెండో సారి ఆమోదించి మళ్లీ మండలికి బిల్లు చేరుతుంది. అలాగే మండలికి మరోసారి బిల్లు వస్తే తిరస్కరించకుండా సెలెక్ట్‌ కమిటీకి పంపడం. ఇక చివరిగా ఫస్ట్‌టైం బిల్లు వచ్చినప్పుడే సెలక్ట్‌ కమిటీకి పంపడం.. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపితే అక్కడ దాదాపు 2,3 నెలల పాటు ఆపే ఛాన్స్ ఉంది. ఇటు వైఎస్సార్‌సీపీ కూడా తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. మండలిలో బిల్లును ఎలాగైనా గట్టు ఎక్కించాలనే పట్టుదలతో ఉంది. కొంతమంది మంత్రులు కూడా మండలిలో బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మంత్రులు చెబుతున్నట్లు బిల్లు ఆమోదం పొందాలంటే.. టీడీపీ ఎమ్మెల్సీలు కొందరు బిల్లుకు మద్దతు ఇవ్వాలి.. అదే జరిగితే బిల్లు ఈజీగా పాస్ అవుతుంది. మండలిలో బిల్లు ఆమోదం పొందకపోతే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసే అవకాశాలు లేకపోలేదు. దీన్ని కూడా ఆరు నెలలలోపే ఆమోదించాల్సి ఉంటుంది.. తర్వాత గవర్నర్ ఆమోదించాలి. అనంతరం దాన్ని కేంద్రం పరిశీలనకు పంపితే అక్కడ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆర్డినెన్స్‌‌పై కోర్టుల్లో పిటిషన్లు వేసే అవకాశం కూడా ఉంది. మరి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది.













Untitled Document
Advertisements