వైసీపీ వినాశనానికి నాంది...రెండేళ్లలో ఎన్నికలు..ఏపీకి కొత్త సర్కార్

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 06:00 PM

వైసీపీ వినాశనానికి నాంది...రెండేళ్లలో ఎన్నికలు..ఏపీకి కొత్త సర్కార్

ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే బీజేపీతో బేషరతుగా పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. తాను కేంద్రాన్ని కోరేది ఒక్కటేనని, అది ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపేనని చెప్పారు. రైతులు, ఆడపడుచులు పోరాటం చేస్తున్నా పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం అహంకారంతో ప్రవర్తిస్తోందన్నారు. వాళ్లు తప్పుడు చట్టాలు చేస్తే.. దాన్ని ధర్మబద్ధంగా మార్చలేమా అని పవన్ ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా పూర్తి స్థాయి రాజధానిగా అమరావతే ఉంటుందని రైతులకు మాటిస్తున్నానన్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తే.. కొత్త ప్రభుత్వం వచ్చా మళ్లీ రాజధాని ఇక్కడికే తిరిగి వస్తుందని చెప్పారు. నిన్న అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసుల లాఠీ చార్జ్‌లో గాయపడిన రైతులను మంగళవారం కలిసిన పవన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నరేళ్ల వ్యవధి ఉండగా.. మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నట్లు కామెంట్ చేశారాయన. రాజధాని కోసం భూములు ఇచ్చిన మహిళలు, రైతులపై పోలీసుల లాఠీచార్జ్ తనను కంట‌తడి పెట్టించిందన్నారు పవన్. వారి త్యాగాలను అవహేళన చేస్తున్న వైసీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. వైసీపీ ఆలోచనా‌ విధానాన్ని పోలీసులు అమలు‌ చేస్తున్నారని, ఇంతమంది రైతులు, ఆడపడుచులు పోరాటం‌ చేస్తుంటే కనీస కనికరం చూపకపోవడం దారుణమన్నారు. ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్ర ప్రజలపై రద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు తీసుకుంటుండగా ఆ నాడు ఓకే చెప్పిన జగన్.. ఇప్పుడు కుదరదని అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్, ఒక సామాజిక వర్గం పేరు చెప్పి మహిళలతో కన్నీరు పెట్టిస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు పవన్. వైసీపీ వినాశనానికి రాజధాని మార్పు నాంది అన్నారు. కూల్చివేతలతో మొదలైన పాలన కూల్చివేతతోనే అంతమవుతుందని చెప్పారు. తనకు కేంద్రం నుంచి పిలుపు వచ్చిందని, రేపు ఢిల్లీ వెళ్తున్నానని, రాజధానిగా అమరావతే ఉండాలని కేంద్రాన్ని కోరుతానని చెప్పారు జనసేన అద్యక్షుడు పవన్ కల్యాణ్. ఇక్కడ రైతులు పడుతున్న బాధ కేంద్రం పెద్దలకు వివరిస్తానని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు కూడా తమ బాధను చెప్పుకోలేక పోతున్నారని, రాజకీయ నాయకులు శాశ్వతం కాదని, ఉద్యోగులే పర్మినెంట్ అని, వారు బయటకు వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు పవన్. రైతులకు తాను ఒక్కటే మాట ఇస్తున్నానని, జనసేన పార్టీ ఎలా ఉన్నా..‌ భవిష్యత్తు ఏమైనా ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని, ఇదే తన ధ్యేయం అని చెప్పారు. బీజేపీ, జనసేన కలిసి పని చేసి ఈ మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తే.. కొత్త ప్రభుత్వం రాగానే మళ్లీ అమరావతిని ఎవరూ కదల్చలేరని ధీమా వ్యక్తం చేశారాయన.









Untitled Document
Advertisements