దేశంలో 1.3 కోట్ల మంది కుబేరులు...కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్న సంపద

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 09:06 PM

దేశంలో 1.3 కోట్ల మంది కుబేరులు...కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్న సంపద

దేశంలో ఆర్థిక అంతరాలు తారస్థాయికి చేరాయని అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘ఆక్స్‌ ఫామ్‌’ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విపరీత పరిణామం భారత్‌కు మాత్రమే పరిమితం కాదు...దాదాపు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆర్థిక అంతరాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, అవి మరింత పెరుగుతున్నాయని ఆక్స్‌ ఫామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పేదరికం, ఆర్థిక అంతరాలు వంటి అంశాలపై అధ్యయనం చేసి ‘టైమ్‌ టు కేర్‌’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఇందులో విస్తుపోయే విషయాలెన్నో ఉన్నాయి. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న మన దేశ జనాభాలో కుబేరుల సంఖ్య దాదాపు ఒక్క శాతం. దేశంలోని 1.3 కోట్ల మంది కుబేరుల వద్ద సంపద కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నది. వీరి సంపద జనాభాలో 70శాతం అంటే 95.3 కోట్ల మంది ప్రజల దగ్గర ఉన్న ఆస్తుల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. అటు దేశంలోని టాప్‌-63 మంది బిలియనీర్ల సంపదను కలిపితే 2018-19 దేశ బడ్జెట్‌ 24.42 లక్షల కోట్లను మించిపోతుందట. అలాగే దేశంలోని టాప్‌ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీల సీఈవోలు సెకనుకు సగటున 106 రూపాయలు సంపాదిస్తున్నారు. వారి పది నిమిషాల సంపాదన దేశంలోని సగటు కార్మికుల ఏడాది సంపాదనతో సమానం. ఒక టెక్‌ కంపెనీ సీఈవో ఏడాది ఆదాయంతో సమానమైన మొత్తాన్ని సంపాదించడానికి.. ఒక సగటు మహిళా కార్మికురాలికి 22వేల 277 ఏండ్లు పడుతుంది. అటు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నదని.. ప్రపంచ జనాభాలో 60 శాతం అంటే 460 కోట్ల మంది ప్రజల ఆస్తుల కన్నా 2వేల 153 మంది బిలియనీర్ల దగ్గర దాదాపు రెట్టింపు సంపద ఉన్నదని నివేదిక వెల్లడించింది. అంతేకాదు.. శ్రమకు తగిన ఆదాయం విషయంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆక్స్‌ ఫామ్‌ పేర్కొన్నది. వారు ఇంటిపని, పిల్లలు, వృద్ధుల సంరక్షణ వంటి జీతం లేని పనులకు పనిగంటలను వెచ్చిస్తుండటమే ఇందుకు కారణమని తెలిపింది. గత దశాబ్దకాలంలో అనేకమంది బిలియనీర్ల ఆస్తులు రెట్టింపయ్యా యి. ఐతే అందరి సంపాదనను కలిపి పోల్చినప్పుడు గత ఏడాది వారి సంపాదన కాస్త తగ్గింది. ప్రపంచంలోని టాప్‌ 22 మంది కుబేరుల ధనం.. ఆఫ్రికా ఖండంలోని మహిళలందరివద్ద ఉన్న ఆస్తుల కన్నా ఎక్కువ. గత మూడు దశాబ్దాలతో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా సగటున ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం అసమానతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. ఇందులో ధనిక దేశాలు కూడా ఉన్నాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజలు ప్రభుత్వాలపై తిరగబడ్డారు. దీనికి పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలే ప్రధాన కారణం. విచ్చలవిడి అవినీతి, రాజ్యాంగ ఉల్లంఘన, ధరల పెరుగుదల వంటివి మిగతా కారణాలు. ఇటీవల విడుదలైన పలు అంతర్జాతీయ సర్వేల ఆధారంగా, క్రెడిట్‌ సుయిస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ‘గ్లోబల్‌ వెల్త్‌ డాటాబేస్‌-2019’, ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా-2019 నుంచి సమాచారం సేకరించి ఈ నివేదికను రూపొందించినట్టు ఆక్స్‌ ఫామ్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 42 శాతం మంది మహిళలు కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగం పొందలేకపోతున్నారు. పురుషుల్లో ఇది ఆరుశాతంగా ఉన్నది. ప్రభుత్వాలు చొరవతీసుకొని ప్రత్యేక విధానాలను రూపొందించినప్పుడే ధనికులు, పేదల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పడుతాయని ఆక్స్‌ ఫామ్‌ ఇండియా సీఈవో అమితాబ్‌ బెహర్‌ చెప్పారు. ధనవంతులు, కార్పొరేట్‌ సంస్థలపై ప్రభుత్వాలు తగిన స్థాయిలో పన్నులను విధిస్తున్నాయని, ఐతే వాటిని వసూలు చేయడంలో మాత్రం విఫలమవుతున్నాయన్నారు. కచ్చితంగా పన్నులు వసూలు చేయగలిగితే దేశాభివృద్ధికి, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి, పేదరికంపై పోరుకు వెచ్చించే అవకాశం ఉంటుందన్నారు. అటు దేశంలోని కుబేరులు కాస్త పెద్ద మనసు చేసుకొని రాబోయే పదేండ్ల సంపాదనకు సంబంధించి 0.5 శాతం అదనంగా పన్ను చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని విద్య, వైద్యం, శిశు సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడిగా పెట్టి.. 11.7 కోట్ల ఉద్యోగాలను సృష్టించవచ్చని ఆక్స్‌ ఫామ్‌ తెలిపింది





Untitled Document
Advertisements