కరోనా వైరస్‌ లక్షణాలు

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 06:05 PM

కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. చైనా సహా ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్‌ కాటేసిన వారి సంఖ్య పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌ సోకి 80 మంది ప్రాణాలు కోల్పోగా.. 2వేల కరోనా కేసులు నమోదైనట్టు చైనా సర్కార్‌ ప్రకటించింది. చైనాలో వూహాన్‌ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్‌ మెల్లమెల్లగా అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంగ్‌కాంగ్, మలేసియా, నేపాల్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్‌ల్యాండ్, వియత్నాం తదితర దేశాలకు వ్యాపించింది. పాకిస్తాన్‌కు కూడా ఈ వైరస్‌ విస్తరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి వచ్చిన నలుగురు పాకిస్తానీయులకి ముల్తానా, లాహోర్‌ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ కలకలం ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వ్యాధిగ్రస్థులను నిర్ధారించకపోయినా.. చైనా, హాంగ్‌కాంగ్‌ తదితర దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా ముందస్తుగా వైద్యులను సంప్రదిస్తున్నారు. కరోనా అనుమానంతో మరో నలుగురు ఫీవర్‌ ఆసుపత్రిలో చేరారు. వీరిలో ముగ్గురు చైనా, హాంగ్‌కాంగ్‌ దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు. ఈ నలుగురినీ ఆసుపత్రిలో చేర్చుకొని, వేర్వేరు గదుల్లో ఉంచి వైద్య పర్యవేక్షణలో సునిశితంగా గమనిస్తున్నారు. ఫలితం ప్రతికూలంగా వచ్చినా ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి విషమించినా వారికి అత్యవసర చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడానికి అక్కడ ప్రత్యేకంగా 8 పడకల ఐసీయూను కూడా వైద్యఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.





Untitled Document
Advertisements