క్రికెట్ ప్రపంచాన్ని భారత్ ఏలుతోంది

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 06:47 PM

క్రికెట్ ప్రపంచాన్ని భారత్ ఏలుతోంది

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ పై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కివీస్ పై భారత జోరు ఏకపక్షంగా సాగిపోతోందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. కివీస్ గడ్డపై వరుసగా రెండు టీ20ల్లోనూ గెలుపొందిన టీమిండియా.. ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో టీ20 మ్యాచ్ హామిల్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకి జరగనుండగా.. మంచి జోరుమీదున్న భారత్‌కి కివీస్‌ పోటీనివ్వడం కష్టమే..! సిరీస్ జరుగుతున్న తీరు గురించి షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ ‘భారత్ జట్టు ఇటీవల తన ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్‌లో ఇది మరోసారి నిరూపితమైంది. రెండో టీ20లో న్యూజిలాండ్ అంత తక్కువ స్కోరు(132)కి పరిమితమై.. ఏ లెక్కన బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న భారత్‌కి పోటీనివ్వగలదు..? ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని భారత్ ఏలుతోంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా కూడా ఈ తరహాలో ఆధిపత్యం చెలాయించేది. కానీ.. అప్పట్లో ఆసీస్‌కి.. భారత్, పాకిస్థాన్ లాంటి జట్లు కనీసం పోటీనిచ్చేవి. కానీ.. ఇప్పుడు భారత్‌కి సిరీస్‌లో న్యూజిలాండ్ పూర్తిగా దాసోహమవుతున్నట్లు కనిపిస్తోంది’ అని అక్తర్ వెల్లడించాడు. గత శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఊదేసిన టీమిండియా.. ఆదివారం జరిగిన రెండో టీ20లో 133 పరుగుల టార్గెట్‌ని 17.3 ఓవర్లోనే ఛేదించేసింది. దీంతో.. సిరీస్‌ చప్పగా సాగిపోతున్నట్లు కనిపిస్తోంది.





Untitled Document
Advertisements