ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలికి చరిత్ర… ఎప్పుడు ఏంజరిగిందంటే…?

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 08:40 AM

శాసన మండలిని కొనసాగించాలా.. లేదా … అనే అంశంపై గతంలో అనేకసార్లు చర్చలు జరిగాయి. కొంతమంది దీన్ని రద్దు చేశారు. మరికొంతమంది దీన్ని పునరుద్ధరించారు. మొత్తానికి ఏపీ శాసనమండలికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1968 జులై 8వ తేదీన శాసన మండలి ఏర్పాటైంది. ఆ తర్వాత 17 ఏళ్లపాటు ఇది కొనసాగింది. అయితే 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిని రద్దు చేయాలని నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నిర్ణయించారు. 1985లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో మండలి తొలిసారి రద్దయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1989లో శాసన మండలిని పునరుద్ధరించాలని నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రయత్నించారు. అయితే వివిధ కారణాల రీత్యా ఇది సాధ్యం కాలేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి శాసన మండలిని పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అయితే అది ఏర్పాటు కావడానికి సుమారు మూడేళ్లు పట్టింది. 2007 మార్చి 30న మండలి ఏర్పాటైంది.

ఇక, అప్పటి నుంచి మండలి కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది కంటిన్యూ అవుతోంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మండలిని రద్దు చేస్తూ వై.ఎస్.జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న జగన్ ప్రభుత్వం ఏకంగా మండలిని రద్దు చేసింది. అయితే, ఇక్కడితో మండలి రద్దు పూర్తైనట్లు కాదు. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని పార్లమెంట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. దీన్ని బిల్లు రూపంలో లోక్ సభ, రాజ్యసభలో పెట్టాల్సి ఉంటుంది. మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడితే ఆరోజు నుంచి మండలి రద్దైనట్టు లెక్క. మండలి రద్దు వెంటనే ముగిసే ప్రక్రియ కాదు. తమిళనాట ఎంజీఆర్ హయాంలో మండలిరద్దు ప్రాసెస్ దాదాపు నాలుగు నెలల్లో పూర్తయితే, ఎన్టీఆర్ హయాంలో ఏపీలో మండలి రద్దు ప్రతిపాదన ఇందిరా గాంధీ తిరస్కరించారు. నాదెండ్ల వ్యవహారం తర్వాత, రాజీవ్ హయాంలో ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించారు. ఇప్పుడు ఈ విషయంలో కేంద్రం ఎలా వ్యవహరిస్తుందనే అంశం ఆసక్తికరం. ఇది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల్లోనే ఈ తేలుతుందా లేక మరింత కాలం తీసుకుంటుందా అనే అంశం తేలాల్సి ఉంది. ఈ అంశం వైసీపీ, బిజెపిల మధ్య సంబంధాలను కూడా స్పష్టం చేయనుంది అనే చర్చ కూడా సాగుతోంది.





Untitled Document
Advertisements