బడ్జెట్ 2020-21: పెళ్ళికాని వారికి ఎక్కువ పన్ను!

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 02:04 PM

బడ్జెట్ 2020-21: పెళ్ళికాని వారికి ఎక్కువ పన్ను!

కేంద్రం మరో రెండు మూడు రోజుల్లో బడ్జెట్ 2020-21ను ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్ల తగ్గింపు ఉండొచ్చనే అంచనాలున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా పన్ను రేట్లను మార్చింది. అయితే ఇక్కడ ఒక బడ్జెట్‌లో మాత్రం పెళ్ళైన వారికి ఒక ట్యాక్స్‌ను, పెళ్లికాని వారికి మరో ట్యాక్స్‌ను ప్రతిపాదించారు. 1955-56 బడ్జెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులోనే సంపద పన్ను‌ను ప్రవేశపెట్టారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌ను 5 అణాల నుంచి 4 అణాలకు తగ్గించారు. ఇంకా బడ్జెట్‌ను తొలిసారిగా హిందీలో ప్రవేశపెట్టారు. ‘కమిషన్ సిఫార్సు మేరకు ప్రస్తుతమున్న రూ.1,500 పన్ను మినహాయింపు పరిమితిని రూ.2,000కు పెంచుతున్నాం. ఇది పెళ్లైన వారికి వర్తిస్తుంది. పెళ్లికాని వారికి మినహాయింపును రూ.1,000కు తగ్గిస్తున్నాం. దీని వల్ల ప్రభుత్వానికి రూ.90 లక్షల ఆదాయం తగ్గొచ్చు’ అని బడ్జెట్ ప్రసంగంలో సీడీ దేశ్‌ముఖ్ తెలిపారు. పెళ్లైన వారికి 1955-56లో పన్ను రేట్లను గమనిస్తే.. రూ.2,000 వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.2,001 నుంచి రూ.5,000 వరకు ట్యాక్స్ స్లాబ్‌కు 9 దమ్మిడీల పన్ను, రూ.5,001 నుంచి రూ.7,500 స్లాబ్‌కు ఒక అణా 9 దమ్మిడీల పన్ను, రూ.7,501 నుంచి రూ.10 వేల స్లాబ్‌కు 2 అణాల 3 దమ్మిడీల పన్ను, రూ.10,001 నుంచి రూ.15 వేల స్లాబ్‌కు 3 అణాల 3 దమ్మిడీల పన్ను, రూ.15,001 నుంచి ఆపైన స్లాబ్‌లో ఉన్న వారికి 4 అణాల పన్ను పడేది. అదే పెళ్లి కాని వారి విషయానికి వస్తే.. రూ.1,000 వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.1,001 నుంచి రూ.5,000 వరకు స్లాబ్‌కు 9 దమ్మిడీల పన్ను, రూ.5,001 నుంచి రూ.7,500 ట్యాక్స్ స్లాబ్‌కు 1 అణా 9 దమ్మిడీల పన్ను, రూ.7,501 నుంచి రూ.10 వేల స్లాబ్‌కు 2 ఆణాల 3 దమ్మిడీల పన్ను, రూ.10,001 నుంచి రూ.15 వేల స్లాబ్‌కు 3 అణాల 3 దమ్మిడీల పన్ను, రూ.15,001 నుంచి ఆపైన ఆదాయం ఉన్న వారికి 4 అణాల పన్ను ఉండేది.





Untitled Document
Advertisements