కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తొలి భారతీయుడు!

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 09:12 PM

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తొలి భారతీయుడు!

భారత్‌లో నమోదైన మూడు కరోనా పాజిటివ్ కేసుల్లో ఒకరికి పూర్తిగా నయమైందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. చైనాలో మెడిసిన్ చదువుతూ గత నెలలో స్వస్థలానికి వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థులకు కరోనా సోకిందని, వారిలో ఒకరు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని చెప్పారు. ఆ విద్యార్థికి శాంపిల్స్ పలుసార్లు టెస్టుల్లో నెగటివ్ వచ్చినట్లు నిర్ధారించుకున్నాకే ఇంటికి పంపినట్లు వివరించారు. మిగిలిన ఇద్దరు కూడా కోలుకుంటున్నారన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎవరూ భయపడాల్సిందేమీ లేదని చెప్పారు. విమానాశ్రయాలతో పాటు దేశంలోని 12 మేజర్, 65 మైనర్ పోర్టుల్లోనూ కరోనా స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్. ఇప్పటి వరకు రెండున్నర లక్షల మందికి పైగా ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ పుట్టిన చైనాలోని వుహాన్ సిటీ నుంచి తీసుకుని వచ్చి ఐటీబీపీ క్యాంపులో ఉంచిన 402 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. వారికి కరోనా టెస్టులు పలుమార్లు చేయగా.. నెగటివ్ వచ్చిందన్నారు. ఇవాళ ఫైనల్ టెస్టుల కోసం శాంపిల్స్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జపాన్ పోర్టులో నిలిపేసిన డైమండ్ ప్రిన్సెస్ షిప్‌లో ఉన్న ఇద్దరు భారత సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని, వారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని చెప్పారు హర్షవర్దన్. చైనాలో మాదిరిగా భారత్‌లో ఏవైనా అనుకోని అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎదుర్కొనేందుకు అవసరమైన మాస్కులు, మందులు అన్నీ భారీగా స్టాక్ సిద్ధంగా ఉంచామన్నారు. ప్రధాని మోడీ ఆదేశాల నేపథ్యంలో ఓ మంత్రుల బృందం దేశంలో కరోనా పరిస్థితి, సన్నద్ధతపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే చైనాకు సాయంగా నిలవాలన్న ఆలోచనలో భాగంగా మందులు, మాస్కులు, మెడికల్ ఎక్యూప్‌మెంట్స్ పంపుతున్నామన్నారు.






Untitled Document
Advertisements