తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ 2,000 కోట్ల భారీ కుంభకోణం

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 09:18 PM

తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ 2,000 కోట్ల భారీ కుంభకోణం

తెలుగు రాష్ట్రాల్లో భారీ కుంభకోణం బయటపడింది. కేవలం అంచనాల్లోనే అక్షరాల 2,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని అధికారులు గుర్తించారు. గతం వారం రోజుల నుంచి ఐటీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 3 ఇన్ ఫ్రా కంపెనీల కార్యాలయాల్లో సోదాలు జరపగా.. బోగస్ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు తెలిసింది.

బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్ ల ద్వారా సదరు కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించిన ఐటీ శాఖ.. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు భావిస్తోంది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ- మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతో పాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు పేర్కొంది.



ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిపిన దాడులతో ఈ కుంభకోణం బయటపడింది. ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించి, నిధులను దారి మళ్లించారని అధికారులు గుర్తించారు. పన్ను లెక్కలకు దొరకకుండా చిన్న మొత్తాల రూపంలోనే రూ.2 కోట్ల నిధులు దారి మళ్లాయని తెలిసింది.

ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించామని.. గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు తెలిసిందని అధికారులు చెబుతున్నారు.ఈ ఐటీ దాడుల్లో రూ.85 లక్షల అక్రమ నగదు, 75 లక్షల నగలు, 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేశారు అధికారులు.





Untitled Document
Advertisements