భారతీయుడు బ్రిటన్‌ను శాసించబోతున్నాడు

     Written by : smtv Desk | Fri, Feb 14, 2020, 08:40 AM

ఒకప్పుడు బ్రిటిష్ దేశం భారత్‌ను పరిపాలించింది. ఇప్పుడు మన భారతీయుడు బ్రిటన్‌ను శాసించబోతున్నాడు. అతనే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆయన పేరును ఈరోజు ఖరారు చేశారు. ప్రధానమంత్రి తరువాత 2వ స్థానంలో ఉండే అత్యంత కీలకమైన ఆర్ధికమంత్రి పదవి భారతీయమూలాలున్న వ్యక్తికి దక్కడం అరుదైన గౌరవమే.

రిషి సునక్ తండ్రి బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్‌లో పనిచేసేవారు. తల్లి ఒక మెడికల్ షాప్ నిర్వహిస్తుండేవారు. సాధారణ మద్యతరగతి కుటుంబానికి చెందిన రిషి సునక్ బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లోని సౌతాంప్టన్‌లో జన్మించారు. చిన్నప్పటి నుంచి సమాజం కోసం తల్లితండ్రులు చేస్తున్న సేవలను చూస్తూ ఎదిగిన రిషి సునక్, వారి స్పూర్తితోనే ప్రజలకు సేవ చేయాలనే తలపుతో రాజకీయాలలోకి ప్రవేశించి తన సమర్ధతతో అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు.

నారాయణమూర్తి కుమార్తె అక్షతమూర్తిని ప్రేమించి 2009లో వివాహం చేసుకున్నారు. సునక్, అక్షత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.



రిషి సునక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ లో డిగ్రీ చేశారు. ఆ తరువాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. ఆ తరువాత కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులలో పనిచేశారు. ఆ అనుభవం, తల్లితండ్రులు స్పూర్తితో బ్రిటన్‌లో చిన్న చిన్న వ్యాపారసంస్థల ఏర్పాటుకు సహకరించే సంస్థను ఏర్పాటుచేశారు. తల్లితండ్రుల సేవా స్పూర్తితోనే రాజకీయాలలోకి ప్రవేశించి యార్క్ షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2015లో బ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టిన రిషి సునక్ అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరమే రాలేదు. ఇటీవల రాజీనామా చేసిన ఆర్ధికమంత్రి సాజీద్ జావేద్ కిందపనిచేసిన రిషి సునక్ దేశ ఆర్ధికవ్యవస్థపై తనకున్న పట్టును నిరూపించుకున్నారు. సునక్ పనితీరు పట్ల సంతృప్తి చెందిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ అత్యంత కీలకమైన ఈ పదవిని అప్పగించారు.





Untitled Document
Advertisements