ప్రాక్టీస్ మ్యాచ్‌లో కుప్పకూలిన భారత్...263కే ఆలౌట్

     Written by : smtv Desk | Fri, Feb 14, 2020, 02:50 PM

ప్రాక్టీస్ మ్యాచ్‌లో కుప్పకూలిన భారత్...263కే ఆలౌట్

న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో శుక్రవారం ఆరంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ జట్టు పేలవరీతిలో కుప్పకూలిపోయింది. తెలుగు క్రికెటర్ హనుమ విహారి (101 రిటైర్డ్ ఔట్: 182 బంతుల్లో 10x4, 3x6), టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (93: 211 బంతుల్లో 11x4, 1x6) నిలకడగా ఆడినప్పటికీ.. మిగత బ్యాట్స్‌మెన్‌లు తేలిపోయారు. దీంతో.. 78.5 ఓవర్లలోనే భారత్ జట్టు 263 పరుగులకి ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో ఇస్ సోధి, కుగ్లీన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. గిబ్సన్ రెండు, నీషమ్ ఒక వికెట్ తీశారు. మూడు రోజుల ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో.. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు పృథ్వీ షా (0), మయాంక్ అగర్వాల్ (1) 8 ఓవర్లలోపే పెవిలియన్‌కి చేరిపోగా.. అనంతరం శుభమన్‌గిల్ (0), అజింక్య రహానె (18), రిషబ్ పంత్ (7) కూడా నిరాశపరిచారు. దీంతో.. టీమిండియా చాలా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఐదో వికెట్‌కి 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విహారి- పుజారా జోడి.. టీమ్ పరువు నిలిపింది. అయితే.. పుజారా ఔట్ తర్వాత మళ్లీ భారత్ జట్టు గాడి తప్పింది. ఆఖర్లో సాహా (0), అశ్విన్ (0), జడేజా (8) వరుసగా పెవిలియన్ చేరిపోగా.. ఉమేశ్ యాదవ్ (9) చివరి వరకూ అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ ప్రధాన జట్టుతో ఈ నెల 21 నుంచి భారత్ జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడనుండగా.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ని వినియోగించుకోవాలని ఆశిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి రాలేదు. ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 0-3 తేడాతో కివీస్ చేతిలో టీమిండియా వైట్‌వాష్‌కి గురైన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements