దేశంలోనే తొలిసారి...టిక్ టాక్, వాట్సాప్, ట్విటర్‌పై క్రిమినల్ కేసులు

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 06:40 PM

దేశంలోనే తొలిసారి...టిక్ టాక్, వాట్సాప్, ట్విటర్‌పై క్రిమినల్ కేసులు

సోషల్ మీడియా యాప్‌లు వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్‌లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు గురువారం (ఫిబ్రవరి 27) ఎఫ్ఐఆర్ (374/2020) నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విషం కక్కుతున్న సోషల్ మీడియా యాప్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలంటూ సిల్వేరి శ్రీశైలం అనే సీనియర్ జర్నలిస్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ట్విటర్, వాట్సాప్, టిక్ టాక్ యాప్‌లపై జర్నలిస్టు శ్రీశైలం తొలుత హైదరాబాద్ నగర పోలీస్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ మహంతిని కలసి ఫిర్యాదు చేశారు. అయినా.. ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత సంవత్సరం డిసెంబర్ 12న భారత పార్లమెంట్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొంత మంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా దేశ ధిక్కార వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత శాసనాలను ధిక్కరిస్తూ దేశ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్న సోషల్ మీడియా యాప్‌లను నియంత్రించాలని శ్రీశైలం డిమాండ్ చేస్తున్నారు. ‘సోషల్ మీడియా గ్రూప్స్‌లో సున్నితమైన, మతపరమైన అంశాలపై ప్రజలను రెచ్చగొడుతున్నారు. సోషల్ మీడియా యాప్‌లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్‌లు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు వేదిక అవుతున్నాయి’ అని శ్రీశైలం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా కొన్ని వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ గ్రూప్‌ల పోస్టింగులను జతచేశారు. శ్రీశైలం పిటిషన్‌ను పరిశీలించిన మేజిస్ట్రేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు రిఫర్ చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా యాప్స్‌పై కేసు నమోదైనట్లైంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153A, 121A, 124, 124A, 294, 295A, 505, 120B, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 66A కింద సోషల్ మీడియా యాప్‌లు ట్విటర్, వాట్సాప్, టిక్ టాక్‌పై కేసు నమోదు చేశారు.





Untitled Document
Advertisements