అది సాయం కాదు, సురభి నాటకం: రేవంత్

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 04:54 PM

అది సాయం కాదు, సురభి నాటకం: రేవంత్

ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారంటూ వచ్చిన వార్తలపై కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. అదంతా ఓ పెద్ద నాటకమని ఎద్దేవా చేశారు. సీఎం కాన్వాయ్ వస్తున్న మార్గంలో వృద్ధుడు దరఖాస్తుతో నిల్చొని ఉండటం, అది చూసి కేసీఆర్ తన కారు ఆపడం.. ఇవన్నీ చూస్తుంటే సురభి నాటకాన్ని తలపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘పట్నం గోస’ కార్యక్రమంతో జనం గోడు వింటున్న రేవంత్ రెడ్డి.. శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం కూకట్‌పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. కేటీఆర్ ఊర్లలో తిరుగుతుంటే ఆయన తండ్రి కేసీఆర్ హైదరాబాద్‌లో తిరుగుతూ.. సురభి నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన సందర్శించారు. అక్కడ స్థానిక మహిళలతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కైతలాపూర్‌లోని 140 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తొలుత స్థానిక నివాసితులకే అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండు నెలల్లో వీటిపై చర్యలు తీసుకోవాలని.. లేకపోతే కలెక్టర్ ఆఫీస్‌ను ముట్టడించి, అక్కడే వంటా వార్పు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌లో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని.. దానిపై నివేదిక సమర్పించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లారు. తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. అతడిని గమనించిన కేసీఆర్ తన వాహనశ్రేణిని ఆపించి కారు దిగి ఆగారు. వృద్ధుడి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనకు తానుగా మొహమ్మద్ సలీమ్‌గా పరిచయం చేసుకున్న ఆ వృద్ధుడు ముఖ్యమంత్రి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు. సలీమ్ సమస్యలను విన్న సీఎం కేసీఆర్.. పరిష్కరించాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ శ్వేతా మహంతి అతడికి వికలాంగుల పింఛన్ మంజూరు చేశారు. టోలిచౌకిలో సలీమ్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. అంతేకాకుండా.. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్‌కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడి కుమారుడికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. దీంతో ఆ పెద్దాయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





Untitled Document
Advertisements