విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త రికార్డు...డిమాండ్ ఎందుకు పెరిగిందంటే..!!!

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 05:11 PM

విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త రికార్డు...డిమాండ్ ఎందుకు పెరిగిందంటే..!!!

తెలంగాణలో విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కరెంటు డిమాండ్ కన్నా కూడా ఇప్పుడు అత్యధికంగా నమోదవుతుండడం విశేషం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా శుక్రవారం ఉదయం విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండేది. కానీ, ఇప్పుడు ఒక్క తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే శుక్రవారం (ఫిబ్రవరి 27) 13,168 మెగా వాట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్ 9,620 మెగావాట్లు ఉండేది. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఉదయం 7 గంటల 52 నిమిషాలకు 13,168 మెగావాట్ల డిమాండ్ వచ్చింది. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు ఇదే రికార్డు కావడం విశేషం. సీఎం కేసీఆర్ దూర దృష్టితో చేపట్టిన చర్యలతోనే రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా సరఫరా అవుతోందని అధికారులు వెల్లడించారు. డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ అందుకు తగ్గట్లుగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. దేశంలో విద్యుత్ వినియోగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా మూడో స్థానంలో కర్ణాటక, మొదటి స్థానంలో తమిళనాడు ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. విద్యుత్ డిమాండ్ ఇంకా పెరిగినా వచ్చే ఇబ్బందేమీ లేదని, సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. విద్యుత్ డిమాండ్ గురించి సీఎం కేసీఆర్ ముందే చెప్పారని, అందుకు అనుగుణంగా తాము సరఫరాకు అంతరాయం కాకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. ‘‘సీఎం కేసీఆర్ సూచనల మేరకు మేం ముందస్తు చర్యలు తీసుకున్నాం. 13,500 మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరే ఆటంకం లేకుండా సరఫరా చేయగలం. హైదరాబాద్ మెట్రో రైలు కోసం 150 మెగావాట్ల విద్యుత్ అందిస్తున్నాం. పంట సాగు, ఎత్తిపోతల పథకాల కోసం భారీ మోటార్లను నడిపిస్తుండడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దానికి అనుగుణంగా విద్యుత్ అందించాలని సీఎం చెప్పారు. దాని ప్రకారమే ఇప్పుడు విద్యుత్ సరఫరా చేస్తున్నాం’’ అని ప్రభాకర్ రావు చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను పిక్ అవర్స్‌లో పంపిణీ చేసి వాడుకుంటున్నామని ఆయన చెప్పారు.

Untitled Document
Advertisements